నంద్యాల జిల్లాకు రానున్న సీఎం చంద్రబాబు

బనగానపల్లెలో ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం
పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ.. పర్యటన షెడ్యూల్ విడుదల

నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 9న నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, సభా ప్రాంగణం, సభా వేదిక, పార్కింగ్ స్థలాల్లో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. టీడీపీ కార్యకర్తలతో నిర్వహించే ముఖాముఖి సమావేశం ఏర్పాట్లను కూడా సమీక్షించారు. భోజన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.

ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి 11.20 గంటలకు బనగానపల్లె చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో పట్టణానికి చేరుకుని ఉదయం 11.40 గంటలకు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తనిఖీ చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రజావేదిక కార్యక్రమానికి హాజరై పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగనుంది.

అనంతరం మధ్యాహ్నం 2.35 గంటల నుంచి సాయంత్రం 4.05 గంటల వరకు టీడీపీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. సమావేశం అనంతరం సాయంత్రం 4.20 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడి నుంచి ఉండవల్లికి బయలుదేరుతారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి సభకు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలుస్తోంది.