34,859 devotees | ఆషాఢ ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధం

15 నుంచి అమ్మవారికి ఆసాడసారే..
మంగళవారం 34,859 మంది భక్తుల దర్శనం
నిత్య అన్నదానానికి రూ.5 లక్షలకుపైగా విరాళాలు
భక్తుల సౌకర్యాలపై ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలు
34,859 devotees | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ :
విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగింది. కనకదుర్గమ్మను 34,859 మంది భక్తులు దర్శించుకోగా, ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇదే రోజు జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆషాఢ మాస ఉత్సవాల షెడ్యూల్‌ను విడుదల చేయడంతో పాటు భక్తుల రాకపోకల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

వైభవంగా ఉత్సవాలు…

ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) అధ్యక్షతన సీవీ రెడ్డి చారిటీస్ భవనంలో జరిగిన సమావేశంలో ఆషాఢ సారె, వారాహి నవరాత్రులు, శాకంబరీ ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. ఈ నెల 15 నుంచి సారె సమర్పించే భక్తులు ముందుగా శ్రీ కనకదుర్గ నగర్‌లో నమోదు చేసుకుని, అక్కడే పాదరక్షలు, లగేజీ భద్రపరిచి ఘాట్ రోడ్ మీదుగా ఆలయానికి చేరుకోవాలని నిర్ణయించారు. దర్శనం అనంతరం మహామండపం ఆరో అంతస్తులో సారె సమర్పించి, అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత తిరిగి కనకదుర్గ నగర్‌కు చేరేలా దసరా తరహాలో వన్‌వే విధానం అమలు చేయనున్నట్లు చైర్మన్, ఈవో వి.కె. శీనా నాయక్ వెల్లడించారు. సమావేశంలో మొత్తం 14 తీర్మానాలు ప్రవేశపెట్టగా, కొన్ని ఆమోదం పొందగా మరికొన్ని వాయిదా పడ్డాయి.

ఆలయ వివరాలు ఇలా…

ఆలయ గణాంకాల ప్రకారం మంగళవారం 4,808 దర్శన టికెట్లు విక్రయించగా, 50,870 ప్రసాదాలను పంపిణీ చేశారు. హుండీ, ఇతర విరాళాల రూపంలో రూ.5,07,061 అందగా, 360 సేవలు, 803 తలనీలాల సమర్పణలు, 9,504 మంది భక్తులకు నిత్య అన్నప్రసాదం అందించారు.

అమ్మవారికి విరాళాలు…

ఇక ఆలయ నిత్య అన్నదానం, ఉచిత ప్రసాద విభాగాలకు భక్తులు ఉదారంగా విరాళాలు అందించారు. భవానీపురానికి చెందిన పి. రవిచంద్ర కుటుంబీకులు రూ.1 లక్ష, గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన సానా శ్రీనివాసరావు రూ.1 లక్ష, విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన బుద్ధా వెంకన్న కుటుంబీకులు రూ.2 లక్షలు, కేఎల్‌రావు నగర్‌కు చెందిన పోతిన బేసి కంటేశ్వరుడు–నిర్మలాదేవి దంపతులు రూ.1,00,116 నిత్య అన్నదాన విభాగానికి విరాళంగా సమర్పించారు. ఆలయ అధికారులు, అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యుల సమక్షంలో ఈ విరాళాలను భక్తిపూర్వకంగా అందజేశారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా గాంధీ అమ్మవారి చిత్రపటం రసీదు ప్రసాదాలను అందజేశారు.