రూ.1.16 కోట్లతో మోటూరు సబ్‌స్టేషన్‌లో అదనపు ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం
5 ఎం.వి.ఏ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
ప్రజలు, అధికారులతో కలిసి విన్నింగ్ టీమ్‌గా పనిచేస్తున్నామని వెల్లడి
ఐదు గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందనున్నట్లు ప్రకటన
గుడివాడ రూరల్, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు చేపడుతూ ముందుకు సాగుతున్నామని, అధికారులు, ప్రజలు కలిసి విన్నింగ్ టీమ్‌గా పనిచేస్తుండటం ఆనందంగా ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.
గుడివాడ రూరల్ మండలం మోటూరు సబ్‌స్టేషన్ ప్రాంగణంలో రూ.1.16 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 5 ఎం.వి.ఏ అదనపు ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం ప్రారంభించారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి ట్రాన్స్ఫార్మర్, బ్రేకర్‌ను ప్రారంభించి విద్యుత్ సరఫరాను ప్రారంభించారు.
దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్న ఎమ్మెల్యేకు ప్రజలు, ఆక్వా రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.1.16 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 5 ఎం.వి.ఏ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్‌తో ఐదు గ్రామాల పరిధిలోని 2,600కుపైగా గృహాలు, 450కుపైగా ఆక్వా, వాణిజ్య విద్యుత్ కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుడివాడ నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఉన్న విద్యుత్ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల అభివృద్ధి, విద్యుత్ స్తంభాలు, కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.
విద్యుత్ శాఖ డీఈతో పాటు అధికారుల సేవలను ఎమ్మెల్యే అభినందించారు. గుడివాడలో మోడల్ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం ప్రారంభమైందని, నందివాడ మండలానికి త్వరలో మరో సబ్‌స్టేషన్ మంజూరు కానుందని తెలిపారు. గుడివాడ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి సహకరిస్తున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఈఈ జీబీ శ్రీనివాసరావు, డీఈ బాబీరాజు, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఈడే మోహన్, ప్రజాప్రతినిధులు, టీడీపీ, జనసేన నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామస్తులు, ఆక్వా రైతులు పాల్గొన్నారు.
