బాపట్లలో బైక్ ర్యాలీకి పోలీసుల అడ్డుకట్ట
బాపట్ల (ఆంధ్రప్రభ): మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు నిర్వహించేందుకు సిద్ధమైన బైక్ ర్యాలీని బాపట్ల పోలీసులు బుధవారం అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న పట్టణ సీఐ రాంబాబు సంఘటన స్థలానికి చేరుకుని నాయకులతో చర్చించారు. బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ముందస్తు పోలీసు అనుమతి తీసుకోలేదని, జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నిబంధనల ప్రకారం మాత్రమే ర్యాలీలకు అనుమతులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ర్యాలీగా కాకుండా విడివిడిగా వెళ్లి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఈ సందర్భంగా ఎస్‌ఐ విజయ్ కుమార్, ఎస్‌ఐ షేక్ నసీరీన్, ట్రాఫిక్ సిబ్బంది, కానిస్టేబుళ్లు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు.
