మహిళల భద్రతే లక్ష్యం..
నందికొట్కూరులో శక్తి అవగాహన కార్యక్రమం
విద్యార్థినులు ధైర్యంగా ముందుకు రావాలి.. శక్తి యాప్‌ను వినియోగించాలి : అర్బన్ సీఐ అశోక్ కుమార్
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షియోరాన్ ఆదేశాల మేరకు నందికొట్కూరులో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలో మహిళలపై దాడులు, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలను అరికట్టే లక్ష్యంతో ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ ఆదేశాల మేరకు నందికొట్కూరు అర్బన్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ నంది జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ బద్దుల శ్రీకాంత్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 120 మంది ఇంటర్మీడియట్ విద్యార్థినులు, ఉపాధ్యాయులు శంకర్రావు, శంకర్, ఆత్మకూరు సబ్‌డివిజన్ శక్తి టీం పోలీసులు, రసూల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అర్బన్ సీఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి మహిళ, బాలిక ధైర్యంగా ఉండాలన్నదే ఎస్పీ సునీల్ షియోరాన్ ప్రధాన లక్ష్యమని అన్నారు. కళాశాలకు వెళ్లే సమయంలో ఎవరైనా వేధింపులకు పాల్పడితే భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్‌ను ప్రతి విద్యార్థిని తమ మొబైల్లో తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక్క క్లిక్‌తో సహాయం అందుతుందని తెలిపారు. అలాగే శక్తి వాట్సాప్ నంబర్ 7993485111 గురించి వివరించారు.
ఈ సందర్భంగా పోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, రహదారి భద్రత, హెల్మెట్ వినియోగంపై కూడా విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఇంటికి వెళ్లిన తర్వాత తమ తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లలో కూడా శక్తి యాప్‌ను ఇన్స్టాల్ చేయించాలని సూచించారు.
జిల్లా ఎస్పీ సునీల్ షియోరాన్ మార్గదర్శకత్వంలో జిల్లా వ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తామని అర్బన్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు.
