తాగునీటి ఎద్దడి నుంచి విద్యుత్ సమస్యల వరకు…

తాగునీటి ఎద్దడి నుంచి విద్యుత్ సమస్యల వరకు…

జడ్పీ సమావేశంలో ప్రజాప్రతినిధుల ఆవేదన

ఆలూరు సమస్యలపై ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం.. పరిష్కారానికి కలెక్టర్ల హామీ

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో బుధవారం విస్తృత చర్చ జరిగింది. వ్యవసాయం, తాగునీరు, విద్యుత్, విద్య, గ్రామీణ మౌలిక వసతులు, గ్రంథాలయాలు, రైతు సంక్షేమం, వలస కార్మికుల పిల్లల విద్య తదితర అంశాలను ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకురాగా, కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూదన్, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర యాదవ్, రజక కార్పొరేషన్ చైర్‌పర్సన్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

డ్రై సోయింగ్‌లో ఆశాజనక ఫలితాలు

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి మాట్లాడుతూ, ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందన్నారు. 87 వేల ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటికే 65 వేల ఎకరాల్లో విత్తనాలు వేశారని, అందులో దాదాపు మూడింట రెండొంతుల మేర మొలకలు వచ్చాయని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మెరుగైన ఫలితాలు నమోదయ్యాయని పేర్కొన్నారు.

తాగునీటి సమస్యలపై ప్రధాన చర్చ

సమావేశంలో ఎక్కువ సమయం తాగునీటి సమస్యలపైనే చర్చ జరిగింది. జిల్లాలోని 33 సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ, మరమ్మతుల కోసం రూ.59.70 కోట్లు, ఎస్‌ఎస్ ట్యాంకుల మరమ్మతులకు రూ.16 కోట్లు, ఫిల్టర్ మార్పులకు రూ.6.60 కోట్లు అవసరమని ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నట్లు కలెక్టర్ వివరించారు.

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. చింతకుంట ప్రాంతంలో 40 నుంచి 50 ఏళ్ల క్రితం వేసిన పైప్‌లైన్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, తరచూ దెబ్బతింటూ నీటి సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గజ్జహళ్లి ఎస్‌ఎస్ ట్యాంకు విస్తరణ, కాజీపేట రిజర్వాయర్‌కు ఫిల్టర్ బెడ్ ఏర్పాటు, కోకిలతోటలో కొత్త ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణం, ఆస్పరిలో కొత్త నీటి నిల్వ వ్యవస్థల ఏర్పాటును ప్రభుత్వం చేపట్టాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్, ఆలూరు నియోజకవర్గానికి ప్రత్యేక పైప్‌లైన్ ప్రతిపాదనల అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

అగ్రి ల్యాబ్ తరలింపుపై ఆందోళన

ఆలూరులోని వ్యవసాయ ప్రయోగశాలను ఆదోనికి తరలిస్తున్నారనే వార్తలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని ఎమ్మెల్యే విరూపాక్షి తెలిపారు. ల్యాబ్‌కు తాళాలు వేసి ఉండటాన్ని ప్రస్తావిస్తూ, రైతులకు నేల పరీక్షలు, పంటల సలహాలు స్థానికంగానే అందుబాటులో ఉండాలంటే ఈ కేంద్రాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఎరువుల పంపిణీపై ప్రశ్నలు

ఎమ్మెల్సీ మధుసూదన్ రైతులకు యూరియా, డీఏపీ పంపిణీ విధానంపై అధికారులను ప్రశ్నించారు. ఎకరాల ప్రాతిపదికనా, హెక్టార్ల ప్రాతిపదికనా, లేక శాస్త్రీయ ప్రమాణాల ఆధారంగానా ఎరువుల కేటాయింపు జరుగుతోందో వివరించాలని కోరారు. అలాగే ఏపీఏఐఎంఎస్ యాప్‌పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

విద్యుత్ సమస్యలపై చర్చ

హాలహర్వి, కౌతాళం మండలాల్లో విద్యుత్ సమస్యలను ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకువచ్చారు. జి. హోసల్లి గ్రామంలో ఐదేళ్లుగా శాశ్వత లైన్‌మ్యాన్ లేకపోవడాన్ని ఎమ్మెల్సీ మధుసూదన్ ప్రస్తావించారు.

ప్రమాదకరంగా మారిన ఇనుప విద్యుత్ స్తంభాలను వెంటనే మార్చాలని కలెక్టర్ ఆదేశించారు. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీపై సీఎండీతో చర్చించామని, అక్టోబర్‌లో నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

వలస కుటుంబాల పిల్లలకు 100 సీజనల్ హాస్టళ్లు

వలస కుటుంబాల పిల్లల విద్యకు అంతరాయం కలగకుండా వచ్చే నెలలో 100 సీజనల్ హాస్టళ్లను ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గత ఏడాది అమలు చేసిన ప్రత్యేక ప్రణాళిక కారణంగా పదో తరగతి ఉత్తీర్ణత శాతం 5 శాతం పెరిగిందని, ఈసారి మరింత మెరుగైన ఫలితాల లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

గ్రంథాలయాలకు రూ.17.50 కోట్ల బకాయిలు

గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి కలిపి రూ.17.50 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. బకాయిలు విడుదలైతే గ్రంథాలయాల ఆధునీకరణతో పాటు యువతకు పోటీ పరీక్షల సన్నద్ధత కేంద్రాలను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు.

రైతులకు డీసీఎంఎస్ సేవలు

డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర యాదవ్ మాట్లాడుతూ, జిల్లాలో 19 శాఖల ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. జొన్నలు, కందులు, శనగలను మార్కెట్ ధర కంటే మెరుగైన ధరలకు కొనుగోలు చేశామని తెలిపారు. క్రెడిట్ పరిమితి పెంపుపై కలెక్టర్ దృష్టి సారించాలని కోరారు.

లాండ్రీ యజమానులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం కల్పించాలి

రజక కార్పొరేషన్ చైర్‌పర్సన్ సావిత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 36 వేల లాండ్రీ షాపుల్లో కేవలం 6 వేల మందికే ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తోందన్నారు. కర్నూలు జిల్లాలో 968 లాండ్రీ షాపులు ఉండగా, కేవలం 208 మందికే ప్రయోజనం అందుతోందని తెలిపారు.

ప్రతి గ్రామానికి ప్రతిరోజూ తాగునీరు అందించాలి

సమావేశం ముగింపులో జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, ప్రతి గ్రామానికి ప్రతిరోజూ సురక్షిత తాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు.

ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై కలెక్టర్లు తక్షణ స్పందన చూపడం, అధికారులకు గడువులతో ఆదేశాలు జారీ చేయడం సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Leave a Reply