చేపలకు మేతగా కోళ్ల వ్యర్ధాలు…
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం…
చోద్యం చూస్తున్న అధికారులు
వత్సవాయి, ఆంధ్రప్రభ : తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సాధించాలన్న ఉద్దేశంతో చేపల చెరువుల యజమానులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కుళ్లిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, కుళ్లిన మాంసం చేపలకు ఆహారంగా వేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతోపాటు పర్యావరణానికి ముంపు వాటిల్లుతున్నా అధికారులు మాముళ్ల మత్తులో ఈ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మండల పరిధిలోని ఆలూరుపాడు చెరువులో పెంచుతున్న చేపలకు మేతగా వేరుశనగ చెత్త, తవుడు, సోయాబిన్‌మిలెడ్‌లను వాడాల్సి ఉంది. సంప్రదాయ మేతను వేయడం వల్ల నెలకు ఎకరాకు రూ.25 వేల మేర ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును తగ్గించుకునేందుకు కొందరు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపలకు కోళ్ల వ్యర్థాలను మేతగా వేస్తున్నారు. పట్టపగలే ఆటోలు, వ్యాన్‌లలో కోళ్ల వ్యర్థాలను పక్క మండలం పెనుగంచిప్రోలు నుండి చేపల చెరువులకు తరలిస్తున్నారు.
చేపలకు మేతగా కోళ్ల వ్యర్థాలు….
సాధారణ మేత వల్ల చేపలు నెలకు అర కేజీ నుంచి కేజీ పెరిగితే, కోళ్ల వ్యర్థాలు తిన్న చేపలు మరింత బరువు పెరుగుతున్నాయి. సాధారణ మేతతో పోలిస్తే కోళ్ల వ్యర్థాలు తక్కువ ధరకు వస్తుండటంతో కొందరు చేపల చెరువుల యజమానులు వీటినే వినియోగిస్తున్నారు. పెనుగంచిప్రోలు లో పుణ్యక్షేత్రం ఉండడంతో భక్తులు గ్రామ దేవతకు మొక్కుబడులుగా కోళ్లను కోస్తారు దీంతో పెద్ద సంఖ్యలో చికెన్ షాపులు ఉన్నాయి ఆ చికెన్ షాపుల నుంచి వ్యర్థాలను సేకరించి అక్కడి నుంచి డ్రమ్ములలో చికెన్ వ్యర్థాలను తీసుకొని భారీ వాహనాల ద్వారా చేపల చెరువు వద్దకు చేరవేస్తున్నారు. పట్టపగలే కోళ్ల వ్యర్థాల రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువులో చేపల వ్యర్ధాలు కలపడంతో కనీసం ఆ దారి వెంట నడిచేందుకు కూడా దుర్వాసన వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
నిబంధనలు ఇలా…….
కోళ్ల వ్యర్థాలు చేపలకు మేతగా వేయడాన్ని నిషేధిస్తూ 2016లో ప్రభుత్వం జీవో నంబర్ 56ను జారీ చేసింది. ఈ జీవోను అమలు చేసేందుకు మండల స్థాయిలో తహసీల్దార్, మత్స్య అభివృద్ధి అధికారి (ఎఫ్‌డీవో), ఎస్ఐ, వెహికల్ ఇన్‌స్పెక్టర్‌లతో, టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. పట్టుబడిన వ్యర్థాలను నాశనం చేయడంతోపాటు డ్రైవర్ లైసెన్స్ రద్దు, వ్యర్థాలతో సాగు చేస్తున్న చేపల చెరువుల రిజిస్ట్రేషన్ రద్దు వంటి చర్యలను టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అమలు చేయాల్సి ఉంది. అయితే మండలంలో చేపలకు మేతగా కోళ్ల వ్యర్థాలు వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆహార ప్రియులు కోరుతున్నారు.
