మధిరలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్

మధిర, జూలై 7 (ఆంధ్రప్రభ): మధిర పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణ సమగ్ర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన వివిధ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, రిటైనింగ్ వాల్ నిర్మాణం, మహాప్రస్థానం అభివృద్ధి పనులు, అండర్ డ్రైనేజీ నిర్మాణం, విద్యుత్ అండర్‌గ్రౌండ్ కేబుల్ పనుల పురోగతిని తనిఖీ చేశారు. ఆయా పనుల ప్రస్తుత స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చేలా ఉండాలని, నిర్మాణ నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత, మున్సిపల్ కమిషనర్ సామ్యూల్ బెనటిక్ ఇజ్రాయిల్ పాల్, వైస్ చైర్మన్ కోనా ధని కుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పారుపల్లి విజయ్ కుమార్, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, మిర్యాల వెంకటరమణ గుప్తా, రంగా శ్రీనివాసరావు, తన్నీరు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.