ఐఐఐటీ విద్యార్థినికి పబ్లిక్ క్లబ్ అండ.. రూ.28 వేల ఆర్థిక సాయం
అచ్చంపేట, జూలై 7 (ఆంధ్రప్రభ): అచ్చంపేట పట్టణానికి చెందిన ప్రతిభావంతురాలు, నిరుపేద విద్యార్థిని రింగు కావ్యశ్రీ ఉన్నత విద్యాభ్యాసానికి అచ్చంపేట పబ్లిక్ క్లబ్ చేయూతనిచ్చింది. పదో తరగతిలో 563 మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన కావ్యశ్రీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) బాసర క్యాంపస్‌లో ఐఐఐటీ సీటు సాధించడంతో క్లబ్ కార్యవర్గం అభినందనలు తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె ఉన్నత విద్య కొనసాగింపులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించిన పబ్లిక్ క్లబ్ కార్యవర్గం సమావేశంలో క్లబ్ తరఫున రూ.10 వేల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. అదనంగా కార్యవర్గ సభ్యులు వ్యక్తిగతంగా మరో రూ.18 వేల విరాళం అందజేయడంతో మొత్తం రూ.28 వేల ఆర్థిక సాయాన్ని విద్యార్థినికి అందించారు.
ఈ సందర్భంగా పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు అంగిరేకుల బిక్షపతి, ప్రధాన కార్యదర్శి కనోజు మనోహర్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతిభకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ సహాయాన్ని అందించినట్లు తెలిపారు. సమాజంలోని దాతలు, సేవాభావం కలిగిన వ్యక్తులు కూడా ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. క్లబ్ కార్యవర్గ సభ్యుల సేవాభావాన్ని అభినందిస్తూ పలువురు పట్టణ ప్రముఖులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు.
