చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన కొమ్మిడి
- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, అభిమానులు
- భువనగిరి అసెంబ్లీ పరిధిలో విషాదచాయలు
- నేడు కొమ్మిడి అంత్యక్రియలు
ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి : భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే (1978-1985), నేషనల్ డెమక్రటిక్ పార్టీ, ప్రజా చైతన్య వేదిక వ్యవస్థాపకులు, ప్రత్యేక తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడు, నిత్యవిద్యార్థి, గోదావరి జలాల సాధానోద్యమకారుడు, మూసీ నది పరిరక్షణోద్యమకారుడు, గ్రామంలోని పేద ప్రజలకు మూడు వందల ఎకరాల తన సొంత భూమిని ఉచితంగా పంపిణీ చేసిన భూదాత, బీబీనగర్ నిమ్స్ (ప్రస్తుతం ఎయిమ్స్) సాధానోద్యమకారుడు తెలంగాణ మట్టి మనిషి కొమ్మిడి నర్సింహ్మారెడ్డి (83) నిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వృద్దాప్య అనారోగ్య కారణాలతో నెల రోజుల కిందట దవాఖానలో చేరిన ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో ఈ రోజు 2026 జూలై 7న అర్థరాత్రి 2గంటల సమయంలో ఆయన మరణించారని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. జూలై 8న ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కొమ్మిడి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
పేద ప్రజల సంక్షేమం కోసమే తాపత్రయం..

కొమ్మిడి నర్సింహారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ మండల పరిధిలోని బ్రాహ్మాణపల్లి గ్రామంలో పుట్టి పెరిగారు. కొమ్మిడి రాంచంద్రారెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు ఆరుగురు సంతానం. (కోదండరామిరెడ్డి, అమృతమ్మ, శశిరేఖ, సుగుణ, నరసింహారెడ్డి, బుచ్చిరెడ్డి) 1943 మార్చి 10 న కొమ్మిడి నర్సింహారెడ్డి జన్మించారు. నర్సింహారెడ్డి అతని భార్య సుకన్యమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇద్దరు కూతుళ్లు రజిని రెడ్డి, రాధిక రెడ్డి. నర్సింహారెడ్డి గారు తన పిల్లలను మాత్రం రాజకీయాలకు దూరంగా పెంచారు.
కొమ్మిడి నరసింహారెడ్డి భార్య అనారోగ్యంతో రెండు సంవత్సరాల క్రితం మరణించారు. కొమ్మిడి నర్సింహారెడ్డికి ఊహా తెలిసినప్పటి నుంచి తుది శ్వాస విడిచేవరకు తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం పరితపించారు. భువనగిరి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు భారీ మెజార్టీతో గెలిచిన కొమ్మిడి ప్రజలకు నిస్వార్థంగా సేవలందించారు.
పేదల సమస్యల పట్ల, వాటి పరిష్కారం పట్ల నిరంతరం ఆలోచిస్తూ వారికి సేవలు అందించే క్రమంలోనే ప్రజాభిమానంతోనే ఆయన రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఎంత ఎదిగినా, ఎక్కడ ఉన్నా అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. తాను ఎల్లప్పుడూ జనంలో ఒకడుగా భావిస్తూ అక్కడి ప్రజలతో కలిసి నడిచేవారు. ఆయన చిన్నప్పటి నుంచే సమాజం పట్ల, పేదల పట్ల అత్యంత నిబద్ధతతో వ్యవహరించేవాడు. ఈ విషయంలో తన పెద్దన్న కోదండరామిరెడ్డి ప్రభావం తనమీద ఉన్నదని చెప్పేవాడు.
కొమ్మిడి ది నిరాడంబర జీవితం…

రెండు పర్యాయాలు (1962 – 1970) వరకు బ్రాహ్మణపల్లి సర్పంచ్ గా, 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో సర్పంచ్ హోదాలో ఉంటూనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కాంక్షతో తెలంగాణ పోరాట సమితి భువనగిరి తాలూకా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. భువనగిరి తాలుకా సమితి ప్రెసిడెంట్‌గా రెండు దఫాలుగా పని చేశారు. అనంతరం 1978లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం శాసన సభ్యుడిగా స్వతందత్ర సమరయోదుడు, మాజీ మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీపై 62.75 శాతం ఓట్ల మెజార్టీతో గెలిచారు.
అనంతరం 1983 సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ఎన్టీ రామారావు ప్రభంజనం కనిపించినా, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వరుసగా రెండవసారి కాంగ్రెస్ పార్టీ నుండి కొమ్మిడి నర్సింహారెడ్డి శాసన సభ్యుడిగా మీసాల బిక్షపతిపై 33.80శాతం మెజార్టీ ఓట్లతో విజయం సాధించారు. ఈ రెండు దఫాలుగా కూడా కొమ్మిడి నర్సంహ్మారెడ్డి ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయలేదు.
ఒక్క రూపాయి కూడా పంపిణీ చేయలేదు. ఆయన రెండు పర్యాయాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఖర్చు కోసం కేవలం రూ.15 వేలు మాత్రమే ఖర్చు చేశారు. అయితే 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికలలో యువతకు అవకాశం ఇవ్వాలనే సంకల్పంతో పాటు, ఆ ఎన్నికల నుంచి వివిద రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నాయకులు అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో విరివిగా డబ్బులు, మధ్యం, సారా, బీరు, బిర్యాని పంచుతూ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తుండటంతో విస్మయం చెందిన కొమ్మిడి నర్సింహారెడ్డి ఆ ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు.
సొంత ఇల్లు కూడా లేదు…
ఎనమిది సంవత్సరాలు గ్రామ సర్పంచ్‌గా, రెండు దఫాలు భువనగిరి తాలుకా సమితి ప్రెసిడెంట్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యే(1978 నుంచి 1985 వరకు)గా గెలిచినప్పటికీ ఆయన తన సొంతంగా ఆస్తులు సంపాదించుకోలేదు. బ్రాహ్మాణపల్లి గ్రామంలో నర్సింహారెడ్డి తండ్రి రాంచంద్రారెడ్డి వందల సంవత్సరాల కిందట నిర్మించిన ఇంటిలో నుంచే ఆయన ప్రజలకు సేవలందించారు. ఆయన ఆర్టీసీ బస్సులలోనే తిరిగేవాడు. బజాజ్ చెతక్ స్కూటర్ పైనే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేవారు. అలాగే తాను పుట్టి పెరిగిన బ్రాహ్మాణపల్లి గ్రామంలో పేద ప్రజల జీవణ ప్రమాణాలను పెంచాలనే గొప్ప సంకల్పంతో వందల కోట్ల విలువైన తన వారసత్వంగా వచ్చిన భూములతో పాటు, తన కుటుంబ సభ్యులకు చెందిన సుమారు 300 ఎకరాల భూములను అర్హులైన పేద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు.
కానీ ఆయన మాత్రం సొంతంగా ఇల్లు కూడా సంపాదించుకోలేదు. కొద్ది రోజులు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న ఆయన అనంతరం ఘట్‌కేసర్ సమీపంలోని సంస్కృతి టౌన్‌షిప్ (సింగపూర్ సిటీ)లో చాలా రోజులు అద్దెకున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో చిన్న చిన్న పదవులు వచ్చినా, రాజకీయాల్లో తమ బంధువులు, స్నేహితులున్నా కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్న తరుణంలో కొమ్మిడి నర్సింహారెడ్డి ఆదర్శవంతమైన రాజకీయాలకు, నిస్వార్థమైన ప్రజా సేవకు పునరంకితమయ్యారు. ఎక్కడా కూడా ప్రజాధనాన్ని కొల్లగొట్టలేదు. అయితే కొమ్మిడి నర్సింహారెడ్డికి సొంతంగా ఇల్లు కూడా లేని కారణంగా రామంతాపూర్‌లో నివాసముంటున్న అతని పెద్ద కూతురు రజిని రెడ్డి ఇంట్లోనే చివరి రోజులను గడిపారు.
భవిష్యత్తు తరాలకు స్పూర్తి..
దొరల కుటుంబంలో పుట్టినప్పటికీ, అతని పెద్దన్న తెలంగాణ సాయుధ పోరాటవీరుడు కోదండరామిరెడ్డి ప్రజా పోరాటాల నుంచి స్పూర్తి పొందిన కొమ్మిడి నర్సింహారెడ్డికి ఊహా తెలిసినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని దీన జనుల హక్కుల కోసం, సకల జనుల బతుకు కోసం, మెరుగైన సమాజం కోసం పరితపించారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికై నిరంతరం పరితపించే నిఖార్సైన, నిస్వార్థ ప్రజా నాయకుడిగా కొమ్మడి నర్సింహారెడ్డి యావత్తు తెలంగాణ ప్రజల హృదయాలలో చెక్కు చెదరని స్థానం సంపాదించుకున్నారు. అంతే కాదు అతని వేల కోట్ల విలువైన తన వందల ఎకరాల భూములను పేదలకు ఉంచితంగా పంపిణీ చేసి దొరతనం అంటే దోచుకోవడం కాదు..
పేద, మద్యతరగతి ప్రజల జీవికకు వెన్నెముకగా నిలిచి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలవడమని చెప్పడంతో పాటు ఆచరించి చూపించిన జన నాయకుడు కొమ్మిడి నర్సింహారెడ్డి. త్యాగాలకు పునాదులు పాతిన విప్లవ యోధుడు కొమ్మిడి కోదండ రామిరెడ్డి తోబుట్టువు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి న్నర్సింహ్మా రెడ్డి గారి మరణం తెలంగాణ సామాజానికి తీరనిలోటు. ప్రతిపనికి నాకేంటి, నాకెందుకులే అనుకుంటున్న ఈ రోజులలో ఎనబైయేండ్ల ఏళ్ల వయోభారంతో కూడా నిత్య చైతన్య శీలిగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. వయోభారంతో శరీరం సహకరించని రోజులలోను ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలపై తన గళాన్ని విప్పారు. చివరి శ్వాస వరకు తనదైన శైలిలో ప్రజావ్యతిరేక విధానాలపై దిక్కారం ప్రకటించారు.
భూ చట్టాలకు, అక్రమ అరెస్టులపై..
తెలంగాణ రాష్ట్రంలో తీసుకువచ్చిన ప్రజా వ్యతిరేఖ, పారదర్శకత లోపించిన భూచట్టాలను కొమ్మిడి నర్సింహ్మారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. పీవీ నర్సింహ్మారావు అమల్లోకి తీసుకువచ్చిన భూ సంస్కరణలను అమలు చేయకుండా కొత్త చట్టాల పేరుతో ప్రజల వద్ద ఉన్న భూములను ప్రభుత్వాలే దోచుకుంటున్నాయని ఆయన అనేక వేదికలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ ల్యాండ్ అక్విజేషన్ యాక్టును అమలు చేయడంలో కాంగ్రెస్ టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజా స్వామిక ఉద్యమాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ.. వరవర రావు, గాదె ఇన్నయ్యల అక్రమ అరెస్టులను బహిరంగంగానే ఖండించారు. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా, ప్రజల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వాలు ప్రజాస్వామిక వాదులను అరెస్టు చేస్తున్నాయని, ఏండ్లకేండ్లు జైళ్లలో నిర్బంధిస్తున్నాయని వాటికి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసి ఆయన బహిరంగ పోరాటం చేశారు.
గోదావరి జలాల సాధనే లక్ష్యంగా…
గోదావరి నదీ జలాల సాధన కోసం నరసింహారెడ్డి సాగించిన పోరాటాలు చారిత్రాత్మకమైనవి. భువనగిరి, ఆలేరు ప్రాంతాలకు సాగు నీరు అందించాలని ఇచ్చంపల్లి వద్ద గోదావరిపై బ్యారేజీ నిర్మాణం కోసం నరసింహారెడ్డి అలుపెరుగని పోరాటాలు చేశారు. గోదావరి జలాలను మూసీ నదిలోకి మళ్ళించడం ద్వారా లక్ష ఎకరాలను ఏ విధంగా సశ్యశ్యామలం చేయవచ్చో ఒక బ్లూప్రింట్ తయారు చేశారు. ఆ బ్లూ ప్రింటును ఒక పెద్ద ఫ్లెక్సీపై ప్రింట్ చేయించి, అతని వద్దకు ఎవ్వరు వెళ్లినా ఒక ఇంజనీర్‌లా వివరించేవారు. న
ల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని మూసీ పరీవాహక ప్రాంతంలో జల కాలుష్యం నివారణ కోసం, మానవ వ్యర్థాలతో పాటు రసాయన వ్యర్థాలను మూసీ నదిలో కలుపొద్దని అనేక పోరాటాలు చేశారు. హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారి-202 విస్తరణలో భాగంగా రంగాపురం గ్రామ ప్రజలు ఇండ్లు పొలాలు కోల్పోయి నిర్వాసితులు అయ్యారని, అవి భూదాన్ భూములంటూ ప్రభుత్వం నుండి నష్టపరిహారం చెల్లించాలని రైతుల పక్షాన పోరాటం చేశారు. 2013 మర్చి నెలలో బీబీనగర్‌లో నిమ్స్ (ప్రస్తుతం ఎయిమ్స్) ఏర్పాటు కోసం కోసం ఆమరణదీక్ష చేశాడు.
ఎన్టీఆర్ రమ్మన్నా పోలేదు..
ఎన్టీ రామారావు 1982 ఏప్రిల్ నుంచి 1983 జనవరి వరకు తొమ్మిది నెలలపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలుమూలలా 40 వేల కిలోమీటర్లు చైతన్య రథ యాత్రలు నిర్వహించాడు. ఎన్టీఆర్ కరీంనగర్ పర్యటనలో ఉన్నప్పుడు రాజకీయ కోణంలో ఎన్టీ రామారావుతో మర్రి చెన్నారెడ్డి కలవాల్సి వచ్చింది. ఆ భాధ్యత నర్సింహారెడ్డికి అప్పజెప్పాడు చెన్నారెడ్డి. ఎస్పీ ఆఫీస్‌లో ఉన్న ఎన్టీ రామారావును కలవడానికి నర్సింహారెడ్డి నారాయణ అనే మరో నాయకుడి సహాయంతో ఎన్టీ రామారావు వద్దకు వెళ్ళాడు. చైతన్య రథంలో కూర్చుని వున్న రామారావు నరసింహారెడ్డిని నారాయణ పరిచయం చేయబోతుంటే విసుక్కున్నాడు.
అక్కడినుంచి వెళ్లండంటూ గట్టిగా అరిచాడు.. ఎన్టీ రామారావు ప్రవర్తించిన తీరు నర్సింహారెడ్డి మనసును నొప్పించింది. ఓ రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదనుకుంటూ అక్కడి నుండి వెనక్కి వచ్చేశాడు. అందుకే ఆ తర్వాత ఎన్టీ రామారావే స్వయంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినా కూడా నర్సింహారెడ్డి కనీసం ఆయన వద్దకు వెళ్లలేదు. కొమ్మిడి నర్సింహారెడ్డి గారు భౌతికంగా దూరమైనప్పటికీ, ఆయన ప్రగతిశీల పోరాటాలు, ఆయన, ఆయన కుటుంబం చేసిన త్యాగాలు, నిస్వార్ధమైన ప్రజాసేవ, దానధర్మాలు భవిష్యత్తు తరాలకు మండే కొలిమిలా స్ఫూర్తిని నింపనుంది..
