రైతుల భూముల్లో అటవీ అధికారుల దౌర్జన్యం గర్హనీయం

  • విషయాన్ని పట్టించుకోకుండా మత్తులో జోగుతున్న ఎమ్మెల్యే వినోద్
  • రైతులకు బీజేపీ రాష్ట్ర నేత కొయ్యల ఏమాజీ ఆరోపణ

కన్నెపల్లి, ఆంధ్రప్రభ: దళిత, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల వద్దకు అటవీ అధికారులు పోలీసులతో కలిసి వచ్చి దౌర్జన్యానికి పాల్పడడం గర్హనీయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ తెలిపారు. సోమవారం కన్నెపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను బీజేపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అధికారులు రైతుల భూముల వద్దకు ట్రెంచ్ కొట్టేందుకు వచ్చి రైతులను బెదిరింపులకు గురి చేయడం, వారిపై దౌర్జన్యం చేయడం సరైనది కాదని అన్నారు.

అమాయక దళిత, గిరిజన పేద రైతులపై కర్కశత్వం ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన 34 మంది దళిత, గిరిజన కుటుంబాలకు చెందిన రైతులు గత యాభై ఏళ్లుగా సర్వే నెంబర్ 88, 89లో ఉన్న అసైన్మెంట్ భూములను సాగు చేస్తున్నారని తెలిపారు. కొంతమందికి పట్టా పాస్ పుస్తకాలు, మరికొంతమందికి ఫైనల్ పట్టా పాస్ పుస్తకాలు, మరికొంతమందికి అటవీ హక్కు పత్రాలు ఇచ్చినట్లు చెప్పారు.

అయితే ఇప్పటివరకు నిద్ర మత్తులో జోగుతున్న అటవీ శాఖ అధికారులు ఇప్పుడు అమాయక రైతులపై దాడులు చేయడం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర నేత, జడ్పీటీసీల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజీ తీవ్రంగా విమర్శించారు. ఈ రోజు కొత్తపల్లిలో అటవీ శాఖ అధికారులు రైతుల భూముల్లో అక్రమంగా ట్రెంచింగ్ వేయడానికి ప్రయత్నం చేశారని అన్నారు. వందలాది మంది పోలీసులు, అటవీ సిబ్బంది రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ జైళ్లకు పంపుతామని బెదిరించారని ఆరోపించారు.

రైతుల పక్షాన తాను అండగా ఉంటానని బీజేపీ రాష్ట్ర నాయకులు, సీనియర్ న్యాయవాది కొయ్యల ఏమాజీ తెలిపారు. రైతుల పక్షాన అటవీ శాఖ, పోలీసు అధికారులతో వాగ్వాదం చేసినట్లు చెప్పారు. పేదల భూముల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఏమాజీ మాట్లాడుతూ రైతులపై అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ హైదరాబాద్లో జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల, రైతుల ప్రభుత్వం అని చెప్తూ వారి పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల భూముల్లో అటవీ శాఖ అధికారులు జోక్యం చేసుకుంటే దాడులు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అటవీ అధికారులు రైతుల భూములకు ట్రెంచ్ కొట్టేందుకు వస్తే రైతులను సమీకరించి ప్రతిఘటిస్తామని చెప్పారు.

అటవీ శాఖ అధికారులు జేసీబీతో ట్రెంచింగ్ వేయడానికి ప్రయత్నం చేస్తే రైతులు అడ్డుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కేశవరెడ్డి, గోవర్ధన్, గ్రామస్థులు రవి, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాండూరు సీఐ దేవయ్య, ఎస్‌ఐ విక్రమ్, ఎఫ్‌ఆర్‌ఓ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.