ఎస్‌ఐఆర్ ఫారాలు బీఎల్‌వోలు నింపేలా చర్యలు తీసుకోవాలి
- తొర్రూరు మున్సిపల్ కమిషనర్‌కు సీపీఎం వినతి
తొర్రూరు, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో ప్రజలు ఓటర్ స్లిప్‌లు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం మండల కార్యదర్శి ఎండీ యాకూబ్ పేర్కొన్నారు.
సోమవారం ఆయన ఆధ్వర్యంలో సీపీఎం నాయకులు తొర్రూరు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండటంతో ఓటర్ వివరాల నమోదు ఫారాలు ఎలా నింపాలో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
ఓటరు వివరాలు తప్పుగా నమోదు అయితే పేరు తొలగిపోతుందనే భయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అందువల్ల ఎన్యుమరేటర్లు, బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ ఫారాలు స్వయంగా నింపేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్, సభ్యులు శ్రీరంగం రాధా రామకృష్ణ, దస్తరి భాగ్య, బండి వసంత, కళావతి తదితరులు పాల్గొన్నారు.
