జూలై 10న విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలి

  • ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్

అచ్చంపేట, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా జూలై 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టనున్న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఏఐఎస్‌ఎఫ్ నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయని, విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చి విద్యార్థులు, తల్లిదండ్రులపై అధిక ఆర్థిక భారం మోపుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, విద్యా హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని, నాణ్యమైన ఉచిత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన జూలై 10 విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, ప్రజాస్వామ్యవాదులు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాగర్‌కర్నూల్ జిల్లా నాయకులు మధు, ఆసిఫ్, లక్ష్మణ్, ప్రవీణ్, ప్రవళిక, అనూషతో పాటు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.