ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని తెలంగాణ క్రాంతి దళ్ డిమాండ్

మోత్కూరు, ఆంధ్రప్రభ: విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ క్రాంతి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగం రెడ్డి పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు. సోమవారం మోత్కూరులోని ఆర్యవైశ్య భవన్‌లో తెలంగాణ క్రాంతి దళ్ మండల కమిటీ ఆధ్వర్యంలో “మన ఊరు–మన బడి.. మనమే కాపాడుకుందాం” అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఎన్నికల ముందు మూతపడిన పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల మూసివేత దిశగా అడుగులు వేయడం విచారకరమన్నారు. రాష్ట్రంలో వేలాది ప్రభుత్వ పాఠశాలలు ఏకోపాధ్యాయులతోనే కొనసాగుతున్నాయని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనే నిబంధనను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.

633 మండలాలకు గాను కేవలం ఇద్దరు రెగ్యులర్ ఎంఈఓలు మాత్రమే ఉండటం విద్యాశాఖ పరిస్థితికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలు, కార్పొరేట్ పాఠశాలలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను మూసివేయకుండా బలోపేతం చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు అక్కేనపల్లి వెంకటాచారి, డీటీఎఫ్ జిల్లా ప్రతినిధి బోళ్ల హనుమంత్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు అవిశెట్టి అవిలిమల్లు, బీసీ రిజర్వేషన్ సాధన సమితి జిల్లా నాయకుడు కలిమేల నర్సయ్య, వీఆర్‌పీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల నరేష్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకుడు జిట్ట గౌతమ్, తెలంగాణ క్రాంతి దళ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.