పరిష్కారం పలకరిస్తే సంతోషం పరవళ్లు!
- అర్జీదారుల సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేయండి
- పీజీఆర్ఎస్ సంతృప్తి స్థాయిలో జిల్లాను ముందంజలో నిలపండి
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ , ఆంధ్రప్రభ: ప్రజల సమస్యకు అధికారులు పరిష్కారం చూపినప్పుడు వారి ముఖంలో ఆనందం మన కృషికి దక్కిన ఫలితమని.. ప్రజా స్నేహ పూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చే అర్జీలకు గడువులోగా నాణ్యమైన పరిష్కారాన్ని చూపేందుకు అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు.
సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రారంభానికి ముందు శాఖల వారీగా వచ్చిన అర్జీలు, వాటి పరిష్కారంపై కలెక్టర్ లక్ష్మీశ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీ వెనుక ఒక కుటుంబం ఆశలు ఉంటాయన్న విషయాన్ని గుర్తించి.. అర్జీలను కేవలం విధి నిర్వహణలో భాగంగా కాకుండా, బాధ్యతగా స్వీకరించి సత్వరమే పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందించాలని సూచించారు.
సమస్య పరిష్కారంలో అర్జీదారుల సంతృప్తి అధికారుల పనితీరుకు నిజమైన గుర్తింపు అని పేర్కొన్నారు. అర్జీదారులతో సరైన విధంగా మాట్లాడటం ముఖ్యమని, వారికి సమస్య పరిష్కార ప్రక్రియను స్పష్టంగా వివరించాలని అధికారులకు సూచించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంపై గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారని.. సమస్య పరిష్కారంపట్ల నిబద్ధత చూపే అధికారులకు సీఎంవో నుంచి ప్రశంసలు కూడా లభిస్తున్నాయని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.
మొత్తం 240 అర్జీలు..
కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహంతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 240 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూకు సంబంధించి 74, పోలీసు శాఖకు సంబంధించి 41, పురపాలక పట్టణాభివృద్ధికి సంబంధించి 23 అర్జీలు ఉన్నాయి. ఈ అర్జీలపై ప్రత్యేకంగా దృష్టిసారించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. కార్యక్రమంలో పీజీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ జి.జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
