బీసీ హాస్టల్స్‌లో సీట్ల కల్పనకు చర్యలు తీసుకోవాలి..

మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్స్‌లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ వసతి కల్పించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఖుష్భూ గుప్తాకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు మారుతీ, జిల్లా కార్యదర్శి సీతారాం మాట్లాడుతూ, గ్రామీణ, దూర ప్రాంతాల నుంచి ఉన్నత విద్య కోసం జిల్లా కేంద్రానికి వచ్చే విద్యార్థులు హాస్టల్స్‌లో సీట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

బీసీ గర్ల్స్, బాయ్స్ హాస్టల్స్‌లో దాదాపు 400 మందికి పైగా విద్యార్థులు సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ వసతి కల్పించకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, బీసీ హాస్టల్స్‌లో దరఖాస్తు చేసుకున్న అందరికీ సీట్లు కేటాయించాలని, అదనంగా మరో హాస్టల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శి సంజీవ్, నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.