విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
- మల్లా రెడ్డి యూనివర్సిటీ వ్యవస్థాపక చైర్మన్ చామకూర మల్లారెడ్డి..
మేడ్చల్, ఆంధ్రప్రభ : విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకుని భవిష్యత్ పరిశోధకులుగా, దేశాన్ని నడిపించే నాయకులుగా ఎదగాలని మల్లా రెడ్డి యూనివర్సిటీ వ్యవస్థాపక చైర్మన్, మాజీ మంత్రి చామకూర మల్లా రెడ్డి పిలుపునిచ్చారు.
మల్లా రెడ్డి యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ సైన్సెస్ విద్యార్థులతో సోమవారం రోజు ఆయన క్యాంపస్లో ప్రత్యేకంగా ముఖాముఖి ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఉన్నతమైన ఆశయాలను కలిగి ఉండి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దులు దాటి ఆలోచించాలని, సరికొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని యువతకు దిశా నిర్దేశం చేశారు.
ప్రశ్నించే తత్వమే శాస్త్రవేత్తల లక్షణం
సైన్స్ విద్యార్థులకు నిరంతర అభ్యాసం, కొత్త విషయాలను తెలుసుకోవాలనే కుతూహలం చాలా ముఖ్యమని మల్లారెడ్డి గారు పేర్కొన్నారు. యూనివర్సిటీ కల్పిస్తున్న అత్యాధునిక వసతులను ఉపయోగించుకుని రీసెర్చ్ రంగంలో అద్భుతాలు సృష్టించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్, స్కూల్ ఆఫ్ సైన్సెస్ డీన్, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. చైర్మన్ స్ఫూర్తిదాయకమైన మాటలు తమలో ఎంతో ఉత్సాహాన్ని, నమ్మకాన్ని నింపాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
