అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి

  • సావర్‌గాం గ్రామ సర్పంచ్ ముగుడే కపిల్

జుక్కల్, కామారెడ్డి, ఆంధ్రప్రభ: అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్న సేవలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సావర్‌గాం గ్రామ సర్పంచ్ ముగుడే కపిల్ అన్నారు.

సావర్‌గాం తండా అంగన్వాడీ కేంద్రంలో సోమవారం చిన్నారులకు యూనిఫాంలను పంపిణీ చేశారు. అనంతరం పలువురు చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, అర్హులైన చిన్నారులందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను వినియోగించుకొని పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు.

చిన్నారుల అక్షరాభ్యాసం, శారీరక ఎదుగుదల, ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త బుజ్జిబాయి, వార్డు సభ్యులు పరశురాం, బాలాజీ, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.