పాత భాస్కర్ థియేటర్ ఎదుటే అండర్‌పాస్ నిర్మించాలి
చౌటుప్పల్, (ఆంధ్రప్రభ): చౌటుప్పల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ప్రాజెక్టులో భాగంగా పాత భాస్కర్ థియేటర్ ఎదుట పబ్లిక్ అండర్‌పాస్ (పీయూపీ) నిర్మించాలని మునుగోడు నియోజకవర్గ నాయకుడు, అడ్వకేట్ చెరుకు శివకుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. రాంనగర్, కృష్ణానగర్, శాంతినగర్, గణేష్‌నగర్‌తో పాటు సుమారు పది కాలనీలకు చెందిన వేలాది మంది ప్రజలు నిత్యం ఈ ప్రాంతం మీదుగానే రాకపోకలు సాగిస్తుండటంతో ఇక్కడే అండర్‌పాస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
గతంలో ఇదే ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూడా ఉండేదని గుర్తు చేసిన ఆయన, ప్రజలు ఎక్కువగా వినియోగించే ప్రదేశాన్ని వదిలి వేరే చోట అండర్‌పాస్ నిర్మిస్తే ప్రజలకు ఉపయోగం ఉండదని, స్థానిక వ్యాపారాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాత భాస్కర్ థియేటర్ ఎదుటే అండర్‌పాస్ నిర్మించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
