ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థికి ఈఎల్వి ఫౌండేషన్ అండ
చౌటుప్పల్, (ఆంధ్రప్రభ): ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాఠశాల ఫీజు బకాయిలు చెల్లించలేక సర్టిఫికెట్లు పొందలేకపోతున్న పదో తరగతి విద్యార్థికి ఈఎల్వి ఫౌండేషన్ చేయూతనిచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని సాంజాన్ విద్యానికేతన్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన కానుగు అభిమన్యు ఫీజు బకాయిలు చెల్లించలేకపోవడంతో పాఠశాల యాజమాన్యం టీసీ, ఇతర సర్టిఫికెట్లను నిలిపివేసింది.
ఈ విషయాన్ని ఈఎల్వి టీం సభ్యుడు మార్గం శివకుమార్ యాదవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇరుగదిండ్ల భాస్కర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి ఫౌండేషన్ తరఫున రూ.10 వేల ఫీజు బకాయిలను పాఠశాల యాజమాన్యానికి చెల్లించారు. అనంతరం విద్యార్థికి టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్లను అందజేశారు. విద్యార్థి ఉన్నత విద్యకు ఆటంకం కలగకుండా సకాలంలో సహాయం చేసిన ఈఎల్వి ఫౌండేషన్ నిర్వాహకులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో నోముల సత్తిరెడ్డి, బండమీది కిరణ్, రాచకొండ మల్లేష్, ఊదరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
