అవకాశవాదమే ఉగ్రవాదానికి ఊపిరి.. ఉగ్రవాద నిర్మూలనకు కఠిన చర్యలే పరిష్కారం
23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్రం
ఉగ్రవాద సంస్థల విస్తరిస్తున్న నెట్వర్క్
నిరుద్యోగం, అక్రమ మద్దతు ఉగ్రవాదానికి బలం
పాకిస్తాన్ పాత్రపై కేంద్రం ఆందోళన
ఉగ్రవాద నిర్మూలనకు నిర్మొహమాట వైఖరి అవసరం
ఉగ్రవాదులను ఏరివేసేందుకు, కంకణం కట్టుకున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తాజాగా 23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. వీరిలో 17 మంది పాక్ పౌరులు, ఆరుగురు భారతీయులు ఉన్నారు. వీరితో కలిపి కేంద్రం గుర్తించిన ఉగ్రవాదుల సంఖ్య 80కి చేరింది. నిజానికి వీరు మాత్రమే కాదు, జనంలో కలగలిసి పోయిన ఉగ్రవాదులను పేరుపేరునా లెక్కిస్తే ఇంకా ఎన్నో రెట్లు ఉన్నట్టు స్పష్టం అవుతుంది.
పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న లష్కరే తోయిబా, జైష్ ఎ మహ్మద్ సంస్థలు మాత్రమే ప్రధానంగా ఉగ్రవాద సంస్థలుగా తరచు ప్రకటించబడుతున్నప్పటికీ, సరిహద్దు రాష్ట్రమైన కాశ్మీర్‌లోనూ, పొరుగు దేశాల నుంచి అక్రమంగా వచ్చి పడుతున్న వారిలో ఉగ్రవాదులు ఎంతో మంది ఉన్నారు. నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో పేరు ఏదైనా అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. అధికారంలో ఉన్న నాయకులు అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కుంటున్నారు. ఉద్యోగార్థులు తమ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఉగ్రవాదులుగా మారుతున్నారు. అన్ని చోట్లా జరుగుతున్నది ఇదే.
పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ అధికారంలో ఉన్న వారికి ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో పాక్ జాతీయులు 17 మందికీ లష్కరే తోయిబా సంస్థ అధినేత హఫీజ్ మహ్మద్ సయీద్‌కు అత్యంత సన్నిహితులు. వీరంతా చొరబాటు శిక్షణ, డ్రోన్ల ద్వారా ఆయుధాల అక్రమ రవాణా, కాశ్మీర్లో దాడుల ప్రణాళికల్లో పాల్గొన్నవారే. 2016, 2018ల్లో ఆర్మీ క్యాంపులపైనా, సైనిక స్థావరాలపైన జరిగిన దాడులతో సంబంధం ఉందని అధికారులు తెలిపారు.
వారిని పట్టుకోవడానికి ఐదు నుంచి పదేళ్ల వ్యవధి పట్టింది. వీరంతా మన దేశంలోని తమ మిత్రులు, ఆశ్రయం ఇచ్చిన వారి ద్వారా ఇక్కడే స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఏరివేత కార్యక్రమం చురుగ్గా సాగుతున్నప్పటికీ, వారు తమ బంధువులు, ఆశ్రయం ఇచ్చిన వారి అండదండలతో మన దేశంలోనే మారు పేర్లతో నక్కి ఉంటున్నారు.
ఉగ్రవాద సంస్థలకు విరాళాలు ఇచ్చేవారు, ఆర్థిక బలాన్ని చేకూర్చేవారు మన దేశంలోనే ఉన్నారు. ఉగ్రవాదుల కంటే వారే ఎక్కువ ప్రమాదకారులు. ఆ విషయం అధికారంలో ఉన్నవారికి తెలుసు. ప్రభుత్వాలు మారినా, అధికారంలో ఉన్న పార్టీలు మారినా, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న వారికి డోకా లేకపోవడం మన వ్యవస్థలోని లోపం.
ప్రధాని నరేంద్ర మోడీపై దాడులు జరిపేందుకు కుట్ర పన్నిన వారిని ఆస్ట్రేలియాలో పోలీసులు అరెస్టు చేశారు. విఐపీల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, ఉగ్రవాదుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటం వల్ల ఈ తరహా కుట్రలు, పన్నాగాలు పెరిగిపోతున్నాయి.
మోడీ జరుపుతున్న విదేశీ పర్యటనల్లో ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించే దేశాలను ఏకాకులుగా చేసేందుకు జరుపుతున్న కృషి చాలా వరకు ఫలించింది. ముఖ్యంగా, పాకిస్తాన్‌ను ఉగ్రవాదానికి పుట్టినిల్లు అని మోడీ ప్రతి చోటా తెలుపుతున్నారు. అయినప్పటికీ, అమెరికా, చైనా వంటి దేశాలు ద్వంద్వ వైఖరిని అనుసరిస్తుండటం వల్ల ఉగ్రవాద ప్రోత్సాహక దేశాలు ప్రపంచ చిత్రపటంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాయి. ఉగ్రవాదుల ఏరివేతకు, నిర్మొహమాట వైఖరే, శాశ్వత పరిష్కారం.
