అదే నా డిమాండ్ – కవిత

అదే నా డిమాండ్ – కవిత

అధికారులు ఏం చేస్తున్నారు..?


ఉమ్మడి కరీంనగర్ బ్యూరో (ఆంధ్ర ప్రభ) : మొంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలనీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్, మక్తపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మొంథా తుపాను కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారనీ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడిగా కొనుగోళ్లు చేయకపోవడం, దానికి తోడు వర్షాల కారణంగా రైతు పరిస్థితి దయనీయంగా మారిందనీ అన్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ. పది వేలు పరిహారం ఇస్తామంటే ఏ మూలకు సరిపోదనీ, రైతులకు మేలు జరగాలంటే ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. మొలకెత్తిన, బూజు పట్టిన, తేమ శాతం ఎక్కువ ఉన్నా సరే ధాన్యం కొనుగోలు చేయాలనీ అన్నారు. నెల రోజులుగా ధాన్యం కుప్పలు పోసి ఉంచారనీ.. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం కారణంగా ధాన్యమంతా తడిసి పోయింది. వర్షాల కారణంగా ఇంకా నష్టం వాటిల్లే పరిస్థితి ఉందనీ అన్నారు. ధాన్యానికి మెులకలు వస్తున్నాయనీ ఇలాంటి సందర్భంలో తేమ శాతం 17 కన్నా తక్కువ ఉండాలని మిల్లర్లు కండిషన్లు పెడుతున్నారని అన్నారు.

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు అసలు కొనుగోలు కేంద్రాలే ఎందుకు ప్రారంభించలేదని కలెక్టర్ ని ప్రశ్నిస్తున్నానని, అసలు ఐకేపీ సెంటర్లు లేకుండా డైరెక్ట్ గా ధాన్యం మిల్లర్లే కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నానని అన్నారు. ఐకేపీ సెంటర్ల నుంచి మిల్లర్ల వద్దకు ధాన్యం తీసుకెళ్లేందుకు రైతులకు అదనంగా ఖర్చు అవుతోందనీ, తేమ శాతం ఎక్కువ ఉన్న, బూజు పట్టిన, మొలకలు వచ్చిన సరే ధాన్యం కొనుగోలు చేసేలా మిల్లర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలనీ కోరారు. భూమి దస్తావేజులు లేవంటూ కౌలు రైతుల ధాన్యం కొనడం లేదని చెబుతున్నారనీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రైతులను ఇబ్బంది పెట్టటం సరికాదు అన్నారు.

రైతులకు ధాన్యం కొనేలా వెసులుబాటు ఇవ్వండనీ అన్నారు. కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలనీ, వర్షాల కారణంగా చాలా జిల్లాల్లో వరి మొత్తం ఒరిగిపోయింది. అసలు కోసే పరిస్థితి కూడా లేదు. వాటికి సంబంధించిన నష్టాన్ని కూడా ప్రభుత్వం రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు పంట నష్టం అంచనా వేయలేదు. ప్రభుత్వం, కలెక్టర్, అధికారులు ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. అధికారులు ఫీల్డ్ లోకి వచ్చి పంట నష్టం అంచనా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, మొంథా తుపాను పై రివ్యూ చేసి రైతులకు న్యాయం చేయాలని అన్నారు. ప్రభుత్వం ఇస్తామన్న బోనస్ ఇప్పటికీ ఇవ్వలేదనీ పైగా వర్షాలతో పంట నష్టం జరుగుతోంది. రైతుకు అన్ని రకాలుగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని అన్నారు. డైరెక్ట్ గా మిల్లర్లే ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply