అల్లూరి త్యాగస్ఫూర్తి యువతకు ఆదర్శం: ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
మచిలీపట్నం, (ఆంధ్రప్రభ): స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అల్లూరి త్యాగశీలిని, పోరాట పటిమను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య చరిత్రలో మహోజ్వల శక్తిగా నిలిచారని, బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహస్వప్నంగా మారిన విప్లవ వీరుడని ఎస్పీ కొనియాడారు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం సాధ్యమని నమ్మి తన ప్రాణాలను దేశం కోసం అర్పించారని, ఆయన దేశభక్తి అనేక మందిలో జాతీయవాద స్ఫూర్తిని రగిలించిందని పేర్కొన్నారు.
అల్లూరి సాగించిన సాయుధ పోరాటం తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని, ఆయన త్యాగం, ధైర్యసాహసాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు.
