కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సింగరేణి కార్మికుల సమస్యల వినతి

భూపాలపల్లి, ఆంధ్రప్రభ: సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) ప్రతినిధులు శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సింగరేణి సమీక్షా సమావేశంలో కార్మికులకు సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, అండర్‌గ్రౌండ్, ఓపెన్‌కాస్ట్ గనుల్లో భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాచ్యుటీ వంటి సంక్షేమ ప్రయోజనాలు కల్పించడంతో పాటు సుమారు 80 వేల మంది పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సీపీఆర్‌ఎంఎస్ (ఎన్‌ఈ)లోని లోపాలను సరిదిద్ది మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.

జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన 12వ వేతన ఒప్పందాన్ని వేగంగా అమలు చేయాలని, సింగరేణి సీఎండీ, డైరెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని బీఎంఎస్ నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కుమారస్వామి, జాతీయ సభ్యుడు పులి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.