వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై సూరి
మంగపేట, జూలై 4 (ఆంధ్రప్రభ): గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా మంగపేట ఎస్సై టీ.వి.ఆర్. సూరి సూచించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, పాత, మట్టిగోడల ఇళ్లలో నివసించే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండరాదని హెచ్చరించారు.
గోదావరిలోకి కొత్త నీరు వస్తున్నందున చేపల వేట కోసం నది వద్దకు వెళ్లవద్దని, తల్లిదండ్రులు పిల్లలను చెరువులు, కుంటలు, వాగుల వద్దకు వెళ్లకుండా పర్యవేక్షించాలని సూచించారు. రైతులు, వ్యవసాయ కూలీలు వర్షం సమయంలో చెట్ల కింద నిలబడవద్దని, తడిసిన విద్యుత్ స్తంభాలను తాకరాదని హెచ్చరించారు.
నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వాగులు, కాలువలను దాటేందుకు ప్రయత్నించవద్దని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని ఎస్సై సూచించారు. వర్షాకాలంలో రహదారులపై వాహనాలు జారిపోయే ప్రమాదం ఉన్నందున అతివేగంగా నడపకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు.
