100 రోజుల్లోనే ఇంతా..
- హైదరాబాద్లో హెచ్-ఫాస్ట్ దూకుడు..
- 185 కేసులు నమోదు
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్) వంద రోజుల సేవలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ స్వల్ప వ్యవధిలోనే నగరవ్యాప్తంగా ఆహార కల్తీపై విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించిన హెచ్-ఫాస్ట్ బృందం మొత్తం 185 కేసులు నమోదు చేసి, సుమారు 121.87 టన్నుల కల్తీ, నాణ్యతలేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్లో ఆహార భద్రతను బలోపేతం చేయడంలో హెచ్-ఫాస్ట్ కీలక పాత్ర పోషిస్తోందని అధికారులు తెలిపారు. నగరంలోని వివిధ జోన్లలో నిర్వహించిన తనిఖీల్లో ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కల్తీ ఆహార పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టారు.
జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ, వెటర్నరీ తదితర శాఖల సమన్వయంతో పనిచేస్తున్న హెచ్-ఫాస్ట్ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందని అధికారులు పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేసి ఆశించిన ఫలితాలు సాధించిన బృందాన్ని అభినందించారు.
ఆహార కల్తీ నియంత్రణలో భాగస్వాములైన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారంతో ఆహార కల్తీపై మరింత కఠినంగా చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
