ఉల్లి రైతుకు తీపిక‌బురు…

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మార్కెట్‌లో ఉల్లి ధరలు భారీగా పడిపోకుండా రైతులకు గిట్టుబాటు ధర లభించేలా బఫర్ స్టాక్ కోసం కొనుగోలు చేసే ఉల్లి ధరను పెంచింది. దాదాపు 13 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణ‌యించింది. ఈ నిర్ణయంతో క్వింటాల్ ఉల్లి కొనుగోలు ధర రూ.1,875 నుంచి రూ.2,125కు పెరిగింది. ఈ మేర‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతులకు క్వింటాల్‌కు అదనంగా రూ.250 లభించనుంది. ఉల్లి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటుచేసుకోకుండా మార్కెట్‌ను స్థిరీకరించడం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, వినియోగదారులకు అవసరమైన సమయంలో బఫర్ స్టాక్ ద్వారా సరఫరా కొనసాగించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని కేంద్రం తెలిపింది.

రైతుల నుంచే నేరుగా కొనుగోలు..

పెంచిన ధ‌ర‌ల మేర‌కు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయ‌నున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (NAFED), భారత జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య (NCCF) రైతుల నుంచి నేరుగా ఉల్లిని కొనుగోలు చేయనున్నాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరేలా ఈ ప్రక్రియ కొనసాగనుంది. సాగు వ్యయాలు పెరుగుతున్న తరుణంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఉల్లి రైతులకు గణనీయమైన ఊరటనివ్వనుంది. ప్రభుత్వం అధిక ధరకు కొనుగోలు చేయడంతో బహిరంగ మార్కెట్‌లో కూడా ధరలు మెరుగుపడే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.