ఇంటింటికీ న్యాయసేవలు చేరేలా పీఎల్‌వీలు పనిచేయాలి: జిల్లా జడ్జి
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి అర్హ పౌరుడికి ఉచిత న్యాయ సేవలు అందేలా పారా లీగల్ వాలంటీర్లు (పీఎల్‌వీలు) చురుకుగా పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె. జీవన్ కుమార్ సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో పీఎల్‌వీలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ అయిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె. జీవన్ కుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రజల్లో న్యాయ అవగాహన పెంపొందించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందేలా పీఎల్‌వీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావడంతో పాటు న్యాయ సేవలను గ్రామీణ స్థాయిలో మరింత విస్తరించేలా కృషి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల, పారా లీగల్ వాలంటీర్లు మంగళపల్లి శ్రీనివాస్, రజిని, రామస్వామి, లక్ష్మీనారాయణ, నరేందర్, తిరుపతి, రమాదేవి, కిరణ్, అంజయ్య, సంపత్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
