8 నెలలుగా జీతాలు లేవు.. మంత్రి కేశవ్‌కు కార్మికుల వినతి
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: నింబగల్లు బహుళార్థక సురక్షిత నీటి సరఫరా పథకంలో పనిచేస్తున్న తమకు గత ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆర్‌డబ్ల్యూఎస్, సీసీడబ్ల్యూఎస్ పథకం కార్మికులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. శనివారం పెద్దకౌకుంట్ల గ్రామంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వారు తమ సమస్యను వివరించారు.
ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ 24 ఏళ్లుగా 21 మంది ఈ పథకంలో పనిచేస్తున్నప్పటికీ గత ఎనిమిది నెలలుగా జీతాలు అందక కుటుంబ పోషణ, ఇంటి అద్దెలు, పిల్లల చదువుల ఖర్చులు భరించడం కష్టంగా మారిందన్నారు. షెడ్యూల్ ప్రకారం రూ.27,700 వేతనం ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.12 వేలే చెల్లిస్తున్నారని, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విషయాన్ని వెంటనే స్పందించిన మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈతో ఫోన్‌లో మాట్లాడి, కార్మికులకు పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికి కార్మికులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
