భద్రతా నిబంధనలు పాటించాలి.. ప్రాణం అమూల్యం

  • టిజి ఎన్పీడీసీఎల్ వరంగల్ సిఎండి కర్నాటి అరుణ్ రెడ్డి
  • ఎడపల్లి విద్యుత్ ఉపకేంద్రం పరిశీలన.. సిబ్బందికి భద్రతపై సూచనలు

ఎడపల్లి, ఆంధ్రప్రభ : విధి నిర్వహణలో విద్యుత్ సిబ్బంది భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రాణం అమూల్యమైందని టీజీఎన్‌పీడీసీఎల్ వరంగల్ సీఎండీ కర్నాటి అరుణ్ రెడ్డి సూచించారు. శనివారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

సుమారు 35 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఉపకేంద్రాన్ని మరో 20 సంవత్సరాలు సురక్షితంగా పనిచేసేలా ఆధునికీకరించడం అభినందనీయమని పేర్కొంటూ నిర్మాణ, ఆపరేషన్, సివిల్ విభాగాల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎడపల్లి సబ్‌డివిజన్ ఇంజనీర్లు, సిబ్బందితో సమావేశమై క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలపై సూచనలు చేశారు.

జైతాపూర్, పోచారం ఫీడర్ల పరిధిలో 11 కేవీ లైన్లు ఎక్కువ దూరం ఉండటంతో బాపునగర్‌లో కొత్త విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు చేయాలని సిబ్బంది కోరగా, సంబంధిత అంచనాలు సిద్ధం చేసి తనకు పంపాలని డీఈ, ఎస్‌ఈలకు ఆదేశించారు.

అలాగే పాత హెచ్‌పీడీఎస్ వ్యవస్థ స్థానంలో ఎల్‌టీ లైన్లను కండక్టర్లతో బలోపేతం చేయడం, గ్రామాల్లోని ఇనుప విద్యుత్ స్తంభాల స్థానంలో సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయడం, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కొత్త విధానంలో ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పని ప్రారంభించే ముందు ఒక్క నిమిషం భద్రతపై ఆలోచించి ఆ తర్వాతే విధులు నిర్వహించాలని “వన్ మినిట్ రూల్”ను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా ఏడీఈ (కన్‌స్ట్రక్షన్) తోట రాజశేఖర్ సీఎండీకి స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఈ పి.వి. రాజేశ్వరరావు, డీఈ ముక్తార్, డీఈ వెంకటరమణ, ఏడీఈ ప్రభాకర్, ఏఈ కిషోర్ రెడ్డి, ఈఈ (సివిల్) స్వామి, ఏఈ సుమిత, ఏడీఈ గుప్తా, ఏఈ కార్తీక్‌తో పాటు ఎడపల్లి, రెంజల్, బోధన్ రూరల్ ప్రాంతాల విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.