ఘనంగా అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు

అల్లూరి ఆశయాలు యువతకు స్ఫూర్తి కావాలి: జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్

ఏలూరు, ఆంధ్రప్రభ: ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో అల్లూరి సీతారామరాజు చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడని కొనియాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను సమీకరించి పోరాడి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహావీరుడిగా ఆయన చరిత్రలో చిరస్మరణీయుడిగా నిలిచారని అన్నారు.

యువత అల్లూరి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కె. భీమేశ్వర్, జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది పాల్గొని అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించారు.