ఐఐటీ గౌహతిలో సీటు సాధించిన పూర్వ విద్యార్థికి ఘన సన్మానం..
కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మండలం కల్వల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి బానోత్ హుస్సేన్ ప్రతిష్ఠాత్మక ఐఐటీ గౌహతిలో సీటు సాధించడం పట్ల పాఠశాలలో అభినందన సభ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా బానోత్ హుస్సేన్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేస్తే ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం సాధించడం సాధ్యమేనని అన్నారు.
సరైన లక్ష్యం, క్రమశిక్షణ, నిరంతర శ్రమ ఉంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో సీట్లు సాధించగలరని పేర్కొన్నారు. బానోత్ హుస్సేన్ సాధించిన విజయం పాఠశాలకు గర్వకారణమని, ప్రస్తుత విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.
బానోత్ హుస్సేన్ మాట్లాడుతూ, తన విజయానికి ఉపాధ్యాయుల నాణ్యమైన బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహం, నిరంతర సాధన, ఆత్మవిశ్వాసమే కారణమని తెలిపారు. తనకు సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తండ సదానందం, వేముల నాగేందర్, మహంకాళి యాకాంబరం, రాగి భిక్షపతి, వి. రాజేంద్రచారి, ఫిజికల్ డైరెక్టర్ కొప్పుల శంకర్, కే. పార్వతి, ఎం.డి. జుబేర్ అలీ, ఓడపల్లి రాము, కే. రాములు, మార్గం శ్రీనివాస్, జి. నాగరాజు, ఆవుల లింగయ్య, ఎస్. సునీల్ కుమార్, ఎస్. రాధాదేవి, గని లక్ష్మి, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.
