రాజముద్రతో రైతుకు భరోసా….

చింతలపాడులో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
రైతు భూమికి చట్టబద్ధ రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే
బ్యాంకు రుణాలు, సబ్సిడీలు, ప్రభుత్వ పథకాల పొందికకు పాస్ పుస్తకాలు దోహదం
ప్రతి అర్హ రైతుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక చర్యలు

తిరువూరు ఆంధ్రప్రభ : రైతు భూమికి చట్టబద్ధమైన గుర్తింపును మరింత బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు మరింత భరోసాను కల్పిస్తాయని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చింతలపాడులో శుక్రవారం నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు. తిరువూరు మండలం చింతలపాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు భూమికి చట్టబద్ధమైన రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తోందన్నారు. భూమికి సంబంధించిన వివరాలు స్పష్టంగా నమోదుకావడంతో రైతులు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సబ్సిడీలు, వ్యవసాయ పథకాలు, ఇతర ప్రభుత్వ సేవలను సులభంగా పొందేందుకు ఇవి ఉపయోగపడతాయని వివరించారు.

రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం అనేక సంస్కరణలను అమలు చేస్తోందన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రైతులకు అవసరమైన ప్రతి ప్రభుత్వ సేవను పారదర్శకంగా, వేగంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. తిరువూరు నియోజకవర్గంలోని ప్రతి అర్హ రైతుకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రైతు సంక్షేమంతో పాటు గ్రామీణాభివృద్ధి, సాగునీటి వసతులు, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించిన ఎమ్మెల్యే, అధికారులు ప్రజలకు మరింత బాధ్యతాయుతంగా సేవలందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు, రైతులు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.