ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
పామర్రులో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
పామర్రు, ఆంధ్రప్రభ: ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ప్రతి శుక్రవారం ఒక్కో నియోజకవర్గంలో వరుసగా నాలుగు వారాల పాటు నిర్వహిస్తున్న “ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక… మీకోసం” కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు.
శుక్రవారం పామర్రు నియోజకవర్గంలోని ఎస్‌కేఆర్‌ఆర్ జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఆరేపల్లి కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ పి. నీలకంఠేశ్వరరెడ్డితో కలిసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చిన్నచిన్న సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రతిసారీ మచిలీపట్నంలోని కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేకుండా అధికారులే వారి నియోజకవర్గాలకు వస్తున్నారని తెలిపారు. నాలుగు వారాల పాటు నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అధికారులకు ఇచ్చిన ఆదేశాల అమలు తీరును సమీక్షించి, పరిష్కారం కాని సమస్యలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిపత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించదగిన ప్రతి సమస్యను నిర్ణీత గడువులో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
అందిన ప్రధాన వినతులు
- పమిడిముక్కల మండలం మర్రివాడ గ్రామంలోని రైవస్–పుల్లేరు కాలువల సంగమం వద్ద ఉన్న పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో ఎలమర్రు, చినపారుపూడి, సాయిపురం గ్రామాలకు ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయని గ్రామస్తులు తెలిపారు. వంతెనను పునర్నిర్మించి బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని కోరారు.
- మొవ్వ మండలం పెదసనగల్లు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో అంతర్గత రహదారులు లేక వర్షాకాలంలో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సిమెంట్ రోడ్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
- పామర్రు మండలం యలకుర్రు గ్రామానికి చెందిన డ్వాక్రా సభ్యులు, తమ గ్రామంలోని 33 డ్వాక్రా సంఘాలకు బుక్‌కీపర్‌గా పనిచేస్తున్న కనకమేడల జ్యోతి బ్యాంకు రుణాలు, పొదుపు నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
- పమిడిముక్కల మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన డి. వెంకటేశ్వరరావు 2014లో జరిగిన విద్యుత్ ప్రమాదంలో వెన్నెముకకు తీవ్ర గాయమై గత 12 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యారని, తనకు రూ.15 వేల ప్రత్యేక పెన్షన్ మంజూరు చేసి అవసరమైన వైద్య ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
- ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
