గుడివాడను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ఇందిరానగర్, న్యూ ఇందిరానగర్ కాలనీల్లో పర్యటించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.. అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని పిలుపు

గుడివాడ, ఆంధ్రప్రభ: ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందరి సహకారంతో గుడివాడను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు.

శుక్రవారం ఆయన పట్టణంలోని 28వ వార్డు ఇందిరానగర్, న్యూ ఇందిరానగర్ కాలనీల్లో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ఇందిరానగర్ కాలనీలో వంటకాలువ ఆక్రమణల సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, అనంతరం న్యూ ఇందిరానగర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, 20 ఏళ్ల క్రితం ఏర్పడిన తమ కాలనీకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించి అభివృద్ధి దిశగా తీసుకెళ్లారని తెలిపారు. కాలనీలో ఇంకా మిగిలి ఉన్న రెండు మూడు రోడ్లను కూడా నిర్మిస్తే సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని ఎమ్మెల్యేను కోరారు.

ప్రజల సమస్యలను తెలుసుకోవడానికే కాలనీకి వచ్చానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. రోడ్ల నిర్మాణానికి అడ్డంకులు ఏమిటని మున్సిపల్, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

లేఅవుట్‌కు విరుద్ధంగా ఆక్రమణలు చేసి ఇళ్లు నిర్మించడంతో రోడ్ల కోసం కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు జరిగాయని అధికారులు లేఅవుట్ మ్యాప్ ద్వారా వివరించారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రాము, ప్రస్తుతం ఉన్న భౌతిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త లేఅవుట్ రూపొందించాలని అధికారులకు సూచించారు. నూతన లేఅవుట్ సిద్ధమైన వెంటనే రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

కొత్త లేఅవుట్ అమలులో చిన్నచిన్న అడ్డంకులు ఎదురైనా ప్రజలు సహకరించాలని, అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కోరారు. అందరి ప్రయోజనాల దృష్ట్యా తీసుకునే నిర్ణయాలకు తాము పూర్తి సహకారం అందిస్తామని స్థానికులు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఇందిరానగర్ కాలనీకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు, డ్రైన్లు నిర్మించి కొత్త రూపు తీసుకొచ్చామని చెప్పారు. ఇది ప్రారంభం మాత్రమేనని, మిగిలిన రోడ్లను కూడా పూర్తి చేసి కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

అభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. గతంలో లేఅవుట్‌కు విరుద్ధంగా జరిగిన ఆక్రమణల కారణంగానే ప్రస్తుతం రోడ్ల నిర్మాణంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రజలు రెండు దశాబ్దాల పాటు ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త లేఅవుట్ రూపొందించి అందరికీ న్యాయం జరిగేలా అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్, ఎంఆర్వో ప్రసాద్, డీటీ కిరణ్, టౌన్ సర్వేయర్ బీఎస్‌పీ మణికుమార్, మండల సర్వేయర్ అనురూప్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబశివరావు, జనసేన నాయకుడు పందిళ్లమల్లి, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్‌రావు, రామదేని వేణుబాబు, పులపర్తి డేవిడ్‌బాబు, రెడ్డి అప్పారావు, కొడాలి రాజా, రఫీ, లంకపల్లి ప్రియనాధుడు, జయశ్రీ, మేరీ, శ్రీకాంత్, హనుమంతు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.