వినతి స్థానికంగా.. పరిష్కారం సత్వరంగా..!

వినతి స్థానికంగా.. పరిష్కారం సత్వరంగా..!

విజ‌య‌వాడ తూర్పులో విజ‌య‌వంతంగా ప్ర‌త్యేక గ్రీవెన్స్‌
స్థానిక ప్ర‌జ‌ల నుంచి మొత్తం 86 అర్జీలు
కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌రావు

ఆంధ్రప్రభ, విజయవాడ : ప్రజలకు మరింత చేరువగా పరిపాలన అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా జిల్లాస్థాయిలో ప్ర‌తి సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌తో పాటు ప్ర‌తి శుక్ర‌వారం నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలోనూ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) ప్ర‌త్యేక గ్రీవెన్స్ నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏపీఐఐసీ కాల‌నీ క‌ల్యాణ మండ‌పంలో ప్ర‌త్యేక గ్రీవెన్స్‌తో పాటు ఒక నెల‌-ఒక నియోజ‌క‌వ‌ర్గం-నాలుగు సంద‌ర్శ‌న‌లు కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌, స్థానిక శాస‌న‌స‌భ్యుడు గ‌ద్దె రామ్మోహ‌న్ అధికారుల‌తో క‌లిసి పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మొత్తం 86 అర్జీలు వ‌చ్చాయి. పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి 49, రెవెన్యూ 16, గృహ నిర్మాణం 3, విద్య 3, ఐసీడీఎస్ 3 అర్జీలు రాగా ఏపీఐఐసీ 2, పౌర స‌ర‌ఫ‌రాలు 2 అర్జీలు వ‌చ్చాయి. ఇదే విధంగా వివిధ శాఖ‌ల‌కు సంబంధించి మ‌రో ఎనిమిది అర్జీలు వ‌చ్చాయి.

వీటిని క్షుణ్నంగా ప‌రిశీలించి నిర్దిష్ట గ‌డువులోగా ప‌రిష్క‌రించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ మాట్లాడుతూ జులై నెల‌లో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగు చోట్ల ప్ర‌త్యేక గ్రీవెన్స్ నిర్వ‌హించనున్న‌ట్లు తెలిపారు. ప్ర‌జా ద‌ర్బార్ ద్వారా కూడా స్థానిక ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని వాటి ప‌రిష్కారానికి కృషిచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ఇప్ప‌టికే మైల‌వ‌రం, తిరువూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌త్యేక గ్రీవెన్స్ నిర్వ‌హించామ‌ని.. ఇప్పుడు విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నందుకు ఆనందంగా ఉంద‌న్నారు. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను నిబ‌ద్ధ‌త‌తో ప‌రిశీలించి స‌మ‌స్యను నాణ్యంగా అర్జీదారులు సంతృప్తి చెందేలా ప‌రిష్క‌రించాల‌నే ధ్యేయంతో ప‌నిచేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రజలకు సమయం, ప్రయాణ వ్యయం ఆదా కావడంతో పాటు, సమస్యలను స్థానికంగానే త్వరితగతిన పరిష్కరించే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజలకు మరింత అందుబాటులో, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ ఆర్‌డీవో వెన్నెల శ్రీను, పీజీఆర్ఎస్ స‌మ‌న్వ‌య‌క‌ర్త జి.జ్యోతి త‌దిత‌రులు పాల్గొన్నారు.