రూట్స్ యూనిసెక్స్ సెలూన్ వద్ద ఉద్రిక్తత

రూట్స్ యూనిసెక్స్ సెలూన్ వద్ద ఉద్రిక్తత

సెలూన్ ప్రారంభాన్ని వ్యతిరేకిస్తూ నాయ్ బ్రాహ్మణ సంఘం నిరసన..

చిత్తూరు, ఆంధ్రప్రభ : చిత్తూరు నగరంలోని సంతపేట అరగొండ ప్రాంతంలో నూతనంగా ప్రారంభమైన రూట్స్ యూనిసెక్స్ సెలూన్ వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెలూన్ ప్రారంభాన్ని వ్యతిరేకిస్తూ నాయ్ బ్రాహ్మణ సంఘం సభ్యులు నిరసన చేపట్టడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి శాంతిభద్రతలను కాపాడారు. స్థానికుల కథనం ప్రకారం, ఇటీవల ప్రారంభమైన రూట్స్ యూనిసెక్స్ సెలూన్ నిర్వహణపై నాయ్ బ్రాహ్మణ సంఘం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తరహా సెలూన్ల ఏర్పాటుతో తమ సంప్రదాయ వృత్తి, జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

తమ అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సెలూన్ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే సెలూన్ నిర్వాహకులు తమ సంస్థను అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రారంభించామని స్పష్టం చేశారు. ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని, ఎవరి జీవనోపాధికి భంగం కలిగించే ఉద్దేశం తమకు లేదని తెలిపారు. ప్రతి పౌరుడికి చట్టబద్ధంగా వ్యాపారం నిర్వహించే హక్కు ఉందని పేర్కొంటూ తమపై అనవసర ఒత్తిడి తేవడం సమంజసం కాదన్నారు. అధికారులు జోక్యం చేసుకుని సమస్యను నిష్పాక్షికంగా పరిశీలించి న్యాయమైన పరిష్కారం చూపాలని కోరారు.

మరోవైపు నాయ్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, తమ వృత్తికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వ నిబంధనలు, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోరారు. తమ నిరసన శాంతియుతంగానే సాగిందని, తమ అభ్యంతరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. సంఘటన నేపథ్యంలో పోలీసులు ఇరువర్గాలతో మాట్లాడి సంయమనం పాటించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెలూన్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు సూచించినట్లు తెలిసింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి ఇరువర్గాల వాదనలు విని, చట్టపరమైన అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.