amaravati | వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

amaravati | వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

రూపాయి ఖర్చుపెట్టాల్సినచోట 10 రూపాయలు పెడుతున్నారు
రాజధాని త్వరగా పూర్తికావడం చంద్రబాబుకు ఇష్టం లేదు
స్కామ్‌లకు చంద్రబాబు బ్లూప్రింట్ రూపొందించారు
దోచుకోవడమే చంద్రబాబు ప్రయారిటీగా మారింది
ప్రశ్నిస్తే మాపై విరుచుకుపడుతున్నారు
సోషల్ మీడియా పేరుతో టీడీపీ ఫేక్‌ సైన్యం-సజ్జల

amaravati |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతుల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజధాని నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. అమరావతి అభివృద్ధి కంటే భారీ వ్యయాలు, అప్పులు, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు.

మీడియాతో మాట్లాడిన సజ్జల.. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైన భౌగోళిక ప్రాంతం కాదని వ్యాఖ్యానించారు. ఒక రూపాయి ఖర్చు చేయాల్సిన పనికి పది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని త్వరగా పూర్తవ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదని, దీర్ఘకాలం నిర్మాణం కొనసాగితే మరింతగా ప్రజాధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంటుందని విమర్శించారు.

అమరావతి పేరుతో ఇప్పటివరకు సుమారు రూ.47 వేల కోట్ల మేర అప్పులు చేశారని సజ్జల ఆరోపించారు. ఇదే మొత్తంతో రాష్ట్రవ్యాప్తంగా రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమ రంగాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి ఖర్చు చేస్తున్న నిధుల్లో కేవలం 10 శాతం వ్యయంతోనే ‘మావిగన్’ అభివృద్ధి చేయవచ్చని కూడా వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కంటే దోపిడీకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించిన సజ్జల.. “రాజధాని పేరుతో ఎంతైనా దోచుకోవచ్చనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. స్కామ్‌లకు ముందుగానే బ్లూప్రింట్ సిద్ధం చేసుకుంది” అని విమర్శించారు. రాజధాని నిర్మాణంపై ఏమాత్రం బాధ్యత ఉన్నా ఈ తరహా వ్యయాలు చేయరని అన్నారు.

గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని సజ్జల ఆరోపించారు. ఈ అప్పులు ఎక్కడ ఖర్చయ్యాయో ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.

రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని సజ్జల ఆరోపించారు. రైతుల భూముల చుట్టూ గుంతలు తవ్వించి వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులతో పాటు ఇవ్వని రైతుల హక్కులను కూడా ప్రభుత్వం గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

జగన్‌మోహన్ రెడ్డి అవినీతికి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తుండటమే అధికార పార్టీకి అసహనంగా మారిందని సజ్జల వ్యాఖ్యానించారు. తమ పార్టీ ప్రజల సమస్యలను మాత్రమే లేవనెత్తుతోందని, రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడడం లేదని స్పష్టం చేశారు. ప్రజా ధనాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారనే అంశంపై ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందని ఆరోపించారు.

సోషల్ మీడియా అంశాన్ని కూడా ప్రస్తావించిన సజ్జల.. అధికార టీడీపీ సోషల్ మీడియా వేదికల ద్వారా అసత్య ప్రచారం నిర్వహిస్తోందని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాస్తవాలను ప్రజల ముందుంచడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా భావిస్తోందన్నారు. అమరావతి నిర్మాణం, రాష్ట్ర అప్పులు, రైతుల సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని సజ్జల స్పష్టం చేశారు.