Pulse Polio | పల్స్ పోలియో సక్సెస్
Pulse Polio | పల్స్ పోలియో సక్సెస్
లక్ష్యాన్ని మించి 101.4 శాతం కవరేజీ
41.53 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు
రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా ముగిసిన కార్యక్రమం
వైద్యులు, ఆశా, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది సేవలు ప్రశంసనీయమన్న మంత్రి దామోదర
ఇంటింటి సర్వేలు, మొబైల్ బృందాల కృషితో లక్ష్యానికి మించిన ఫలితాలు
Pulse Polio | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం ఘన విజయాన్ని నమోదు చేసింది. నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 41,53,185 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారా వైద్య, ఆరోగ్య శాఖ 101.4 శాతం కవరేజీ సాధించింది. ఈ విజయంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేస్తూ కార్యక్రమం విజయవంతం చేసిన వైద్య సిబ్బందిని అభినందించారు.
వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించిన లక్ష్యం 40,97,749 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం కాగా, ఆ లక్ష్యాన్ని అధిగమించి అదనంగా వేలాది మంది చిన్నారులకు టీకాలు అందించడం విశేషంగా నిలిచింది. పోలియో రహిత తెలంగాణ లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పోలియో బూత్‌లతో పాటు ఇంటింటికీ వెళ్లి టీకాలు అందించే కార్యక్రమాన్ని అధికారులు సమర్థవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కార్యక్రమం విజయవంతం కావడంలో వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది చేసిన కృషి ఎంతో ప్రశంసనీయమని అన్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయడం వల్లే రాష్ట్రం లక్ష్యాన్ని మించి కవరేజీ సాధించగలిగిందని పేర్కొన్నారు. ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పల్స్ పోలియో కార్యక్రమంలో స్థిర బూత్‌లతో పాటు మొబైల్ బృందాలు, ట్రాన్సిట్ పాయింట్లు, ప్రత్యేక సర్వే బృందాలను వినియోగించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటి సర్వేలు నిర్వహించి ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సమన్వయంతోనే లక్ష్యాన్ని మించి కవరేజీ సాధించడం సాధ్యమైందని అధికారులు వెల్లడించారు.
పోలియో రహిత తెలంగాణ సాధనే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న వైద్య ఆరోగ్య శాఖ, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజారోగ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది. ప్రజల సహకారం, వైద్య సిబ్బంది అంకితభావం కలిసి రాష్ట్రాన్ని పోలియో రహితంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
