గురుకుల విద్యార్థి అదృశ్యం.. వీడిన మిస్టరీ
- కేశవపట్నంలో బస్సులో ప్రయాణిస్తుండగా గుర్తింపు..
- తల్లిదండ్రులకు అప్పగించేందుకు చర్యలు
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరులోని మహాత్మా జ్యోతిరావ్ పూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి దుర్గం అర్ష అదృశ్యం వ్యవహారంలో చిక్కుముడి వీడింది. పోలీసులు వేగంగా స్పందించి విద్యార్థిని క్షేమంగా గుర్తించారు.
గురువారం పాఠశాల నుంచి విద్యార్థి కనిపించకపోవడంతో పాఠశాల ప్రిన్సిపాల్ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన చెన్నూరు పోలీసులు తమ సాంకేతిక పరిజ్ఞానం, పోలీసు నెట్వర్క్ను వినియోగించి రాష్ట్రంలోని వివిధ పోలీస్స్టేషన్లకు విద్యార్థి వివరాలను పంపించి గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో శుక్రవారం కరీంనగర్ జిల్లా కేశవపట్నం పోలీసులు బస్సులో ప్రయాణిస్తున్న అర్షను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విద్యార్థి క్షేమంగా ఉన్నట్లు చెన్నూరు పోలీసులకు సమాచారం అందించారు.
విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు చెన్నూరు పోలీసు సిబ్బంది కేశవపట్నంకు బయలుదేరినట్లు సమాచారం. కొద్ది గంటల్లోనే అదృశ్యమైన విద్యార్థిని గుర్తించి క్షేమంగా వెలికితీసిన చెన్నూరు పోలీసుల పనితీరును స్థానికులు, పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.
