తిరుమలలో శ్రీవారి దర్శనం..

  • ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు

తిరుమల, ఆంధ్రప్రభ : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో సత్కరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కె. లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోగ్యంగా ఉండాలని, దేశం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

తెలుగు రాష్ట్రాలు మరింత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా భారత్ విశేషమైన కీర్తి, ప్రతిష్ఠలను సంపాదిస్తోందని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ హిందువుల మనోభావాలను గౌరవిస్తూ దేశవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. అయోధ్యలో శ్రీరామ మందిరం, ఉజ్జయినిలో మహాకాళ్ కారిడార్, కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణాల వల్ల దేశ ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం, భక్తి భావం మరింత పెరుగుతున్నట్లు కె. లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.