సగటు జీవి వృద్ధి రేటు ఎంత?.. ఆర్థిక వృద్ధి, అసమానతలపై విశ్లేషణ
సగటు జీవి వృద్ధి రేటు ఎంత?.. ఆర్థిక వృద్ధి, అసమానతలపై విశ్లేషణ
ఆర్థిక వృద్ధి ప్రజల జీవితాల్లో ప్రతిబింబిస్తుందా?
సంపద కేంద్రీకరణ.. పెరుగుతున్న ఆదాయ అసమానతలు
యువత, ఉపాధి, సాంకేతిక మార్పుల ప్రభావం
ప్రజాతంత్ర రాజ్యాంగ వ్యవస్థను కలిగి ఉన్న ఏ దేశంలోనైనా రాజకీయ అధికారం అంతిమంగా ప్రజల చేతుల్లో ఉంటుంది. అటువంటి దేశంలో ఆర్థిక వృద్ధి సాధనతోబాటు సమాంతరంగా ప్రజలను ఆర్థికంగా శక్తివంతులుగా చేయడం అన్నది కూడా కొలమానంగా ఉండాలి. దేశంలో అత్యధిక శాతంగా ఉన్న శ్రామిక ప్రజల సగటు వాస్తవ ఆదాయాలలో పెరుగుదలను పరిగణనలోకి తీసుకోవాలి. దేశ జనాభాను మొత్తంగా ఒక్కటిగానే పరిగణించి సగటు ఆదాయాలను లెక్కించడం వలన ఉపయోగం లేదు. ఎందుకంటే అత్యంత సంపన్నులైన ఒక్క శాతం జనాభాను, కడు పేదరికంలో ఉన్న జనాభాను కలిపి ఒక్కటిగానే లెక్కిస్తే ఏమిటి ప్రయోజనం? అయితే శ్రామిక ప్రజల వాస్తవ సగటు ఆదాయాలను లెక్కించడంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. వాటిని అధిగమించడానికి మొదట మనం దేశంలో అత్యంత దిగువ స్థాయిలో ఆదాయాలు ఉన్న 80 లేదా 90 శాతం ప్రజల సగటు వాస్తవ ఆదాయాలలో పెరుగుదలను లెక్కించడం చేయాలి.
1982-2022 మధ్య 40 సంవత్సరాల కాలంలో వార్షిక జాతీయ ఆదాయ వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంది. ప్రపంచ అసమానతల సూచికను ప్రమాణంగా తీసుకుంటే అత్యంత సంపన్నులైన ఒక్క శాతం ప్రజల వార్షిక ఆదాయం 5.5 శాతం చొప్పున పెరిగింది. తక్కిన 99 శాతం ప్రజల వార్షిక ఆదాయాలు కేవలం 1.5 శాతం చొప్పున మాత్రమే పెరిగాయి. అటువంటప్పుడు దేశ జనాభానంతటినీ ఒక్కటిగానే పరిగణిస్తూ లెక్కిస్తే సగటు ఆదాయ వృద్ధిరేటు 2 శాతం మాత్రమే ఉంది. వాస్తవ పరిస్థితిని ఇది ఎంత తప్పుగా చూపుతోందో ఈ లెక్క బట్టే తెలుస్తోంది. 309 మంది బిలీనియర్ల చేతిలో 33 శాతం స్థూల జాతీయోత్పత్తి ఉంది. ఈ 309 మంది బిలీనియర్లకు పోగా 140 కోట్ల మందికి మిగిలింది 67 శాతం జీఎన్పీ మాత్రమే.
డబ్బుతో అధికారం.. అధికారంతో డబ్బు అనే చట్రంలో ఇరుక్కుపోయిన ప్రపంచ దేశాలను ఏలుతున్న వారిని ఎలా ఎదుర్కొంటారు? నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమాజంలో వీరు ఎలా ఎదగగలరు? కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి పాలిస్తున్న పాలకులు ఒకవైపు, అంతకన్నా మించి కార్పొరేట్ల ద్వారా లబ్ధి పొందుతూ, సామాజిక వనరులను వారికి ధారాదత్తం చేసి తాము ఆస్తులను కూడగట్టుకుంటూ ఉన్న రాజకీయ వ్యవస్థలో డెమోక్రసీ ప్లూటోక్రసీగా మారుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లు, శాటిలైట్లు, నైట్ విజన్ వంటి వ్యవస్థల సహాయంతో పోలీసు, మిలిటరీ వ్యవస్థ మావోయిస్టులపై విరుచుకుపడుతున్నప్పుడు, పాత తుపాకులతో విప్లవకారులు ఏమి యుద్ధం చేస్తారు?
సామాజిక-ఆర్థిక అభివృద్ధి అంశమైన సమస్యను మిలిటరీ సమస్యగా మార్చిన కార్పొరేట్ పాలకుల కుతంత్రాన్ని విప్లవకారులు ఎలా ఎదుర్కోవాలి? ప్రజల్లో ఉండి ప్రజా పోరు జెండాను ఎత్తుకోవాలి. అడవుల్లో ఎందుకు ఉండాలి? సంపద కేంద్రీకరణ, సహజ వనరులపై ఆధిపత్యాన్ని ప్రధాన సమస్యగా భావించాలి. ప్రజల చేతుల్లో డబ్బులు లేవు, జీవనోపాధి లేక, జీవన ప్రమాణాలు పడిపోయి, నిరాశతో ఉన్న యువత, ముఖ్యంగా జెన్ జెడ్ తరంను ఎలా మమేకం చేసుకోవాలి? నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి నేడు ఉంది. కార్పొరేట్ల సంపద మాత్రం పెరిగిపోతున్నది. దీనినే ప్రోత్సహిస్తున్నది ఎవరు? రాజ్యాన్ని, రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న పెట్టుబడిదారులు, పాలకులు ప్రజల నుంచి ఎలా దూరం చేయాలి?
యుద్ధాలతో ప్రపంచ విప్లవం వస్తుందని ఒకప్పటి వాదన. అప్పుడు యుద్ధాలు దేశాల మధ్య జరిగితే ఇప్పుడు పెట్టుబడిదారుల మధ్య జరుగుతున్నాయి. యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. పెట్టుబడిదారుల మధ్య పోటీతోపాటు సయోధ్య కూడా జరుగుతూనే ఉంటుంది. నలిగిపోయేది ప్రజలే. పాలకులు, పెట్టుబడిదారులు మాత్రం కాదు. వాళ్లిద్దరూ ఒకటే దారిలో కవల పిల్లలు. ప్రజలు గాని, వారి శ్రమ గాని వారికి అవసరం లేదు. పెట్టుబడి సంపద కేంద్రీకరణ ముఖ్యం. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న పద్ధతుల్లో ఉత్పత్తి కార్యకలాపాలు రూపొందించి ఆర్థికంగా, రాజకీయంగా దేశాలలో పాలన సాగుతోంది.
ఒకప్పుడు పేద వర్గానికి వ్యతిరేకంగా భూస్వాములు మాత్రమే ఉండేవారు. నేడు పాలకులు, పెట్టుబడిదారులు, ఉత్పత్తి వ్యవస్థ అన్నీ ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని రచయిత అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు ఉన్నప్పుడు ఇంకా ప్రజా పోరాటాలు ఎందుకని పాలకులు అంటున్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఉండాలని పాలకులు చెబుతుంటే, వ్యవస్థ మొత్తం దోపిడీతో ఉందని, బ్రతికేది ఎలా అని విప్లవకారులు ప్రశ్నిస్తున్నారు. మన రాజ్యాంగం ప్రజలకే అన్ని రాజకీయ అధికారాలను ఇచ్చింది. దానికి కట్టుబడి పాలిస్తామని ప్రమాణం చేసిన పాలకులు మాత్రం ప్రజల అధికారాలను, వనరులను నిర్వీర్యం చేసి ఇదే విజయవంతమైన ఆర్థిక విధానంగా చెప్పుకుంటున్నారు. అది దోపిడీ కాదు.. అభివృద్ధి అని పాలకులు అంటున్నారు.
ఇప్పుడు ప్రజా పంథా ఏంటి? ప్రజలతో కలిసి నైతికంగా, ఆర్థికంగా, ముఖ్యంగా రాజకీయంగా ఎదిగి ప్రజా సంక్షేమ పాలన ఎలా రూపొందించాలన్నదే ప్రధాన ప్రశ్న. ఆ విధంగా ప్రజాపాలన జరగాలి. ఈ రకమైన కార్యాచరణ పాటిస్తూ ప్రజలలో ఉంటేనే అది సాధ్యమవుతుంది. అప్పుడే బల ప్రయోగం లేని రాజ్యం వస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల నియంత్రణ, గాని రాజ్యం యొక్క బల ప్రయోగం కాదు. ఉపాధి అవకాశాలు లేక, యువత నిరాశతో కొత్త ఉద్యమాలు ప్రారంభమవుతున్నాయి. ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని సాధించకపోతే మనం ఎంతో కష్టపడి నిర్మించుకున్న ప్రజాస్వామ్య సౌధాన్నే ప్రజలే బద్దలు కొట్టే పరిస్థితి వస్తుందని రచయిత హెచ్చరిస్తున్నారు.
