పెత్తందార్ల ఫలహారంగా ఉపాధి హామీ.. కొత్త చట్టంపై తీవ్ర విమర్శలు

పెత్తందార్ల ఫలహారంగా ఉపాధి హామీ.. కొత్త చట్టంపై తీవ్ర విమర్శలు

కొత్త ఉపాధి చట్టంపై రైతు కూలీ సంఘాల ఆందోళనలు

నరేగా నుంచి కొత్త చట్టం వరకు మారిన విధానాలు

రాష్ట్రాలపై పెరిగిన భారం.. కూలీలపై ప్రభావం

బడ్జెట్ కోతలు.. ఉపాధి హామీకి తూట్లు

దేశవ్యాప్తంగా గ్రామీణ పేదలకు ఎంతో కొంత ఉపశమనంగా ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజి నరేగా) వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఆఫ్‌ రోజ్గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ గ్రామీణ్‌ (విబి జీ రామ్‌ జి)గా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మార్చివేసి ఆ కొద్దిపాటి ఉపశమనాన్ని కూడా హరించి పేద ప్రజల ఊపిరులను తీయడానికి సిద్ధమైంది. జులై ఒకటవ తేదీ నుంచి అమలులోకి వచ్చిన కొత్తగా తెచ్చిన ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని రైతు కూలీ సంఘాలు ఆందోళనలు సాగిస్తున్నాయి. ఈ ఆందోళనలను పెడచెవిన పెడుతున్న మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై జూన్‌ 17వ తేదీన న్యూఢిల్లీలో వ్యవసాయ, గ్రామీణ ప్రాంత వర్కర్స్‌ యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ”నరేగా సంఘర్ష మోర్చా” కొత్తగా తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని, జులై ఒకటో తేదీ నుంచి నిరవధిక ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ పాశవిక చట్టాన్ని రద్దు చేసేంతవరకు ఆందోళన కొనసాగుతుందని కమిటీ ప్రకటించింది. దీనిని బట్టి కొత్త చట్టం యొక్క ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

నరేగా చట్టాన్ని మరింతగా నీరుగార్చే కొన్ని సవరణలతో మోడీ ప్రభుత్వం డిసెంబర్‌ 16న పార్లమెంటు ఉభయ సభలలోను నూతన చట్టంతో బిల్లును ప్రవేశపెట్టింది. పార్లమెంటులో చర్చకు అవకాశం ఇవ్వకుండా, విపక్ష పార్టీల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండానే డిసెంబర్‌ 18వ తేదీ నాటికే చట్టం చేసింది. ఆ విధంగా నూతన చట్టాన్ని ప్రజలపై రుద్దేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమయింది. నరేగా చట్టాన్ని గతంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 1990ల తర్వాత సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను చేపట్టిన దాన్లో భాగంగా ప్రవేశపెట్టింది. వ్యవసాయరంగ సంక్షోభానికి, గ్రామీణ పేదల నిరుద్యోగానికి మూల కారణమైన భూమి సమస్యపైకి ప్రజల దృష్టి మళ్లకుండా గ్రామీణ పేదలకు ఉపాధిని గ్యారెంటీ చేస్తామని భ్రమలు కల్పిస్తూ ఈ ఉపాధి పథకాన్ని ముందుకు తెచ్చారు. 1980ల నుండి ‘పనికి ఆహారం’ పేరుతో సాగిన ఈ పథకాన్ని 2006లో కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకంగా అమలుచేసి 2009 నాటికి మహాత్మా గాంధీ పేరును పథకానికి ముందు చేర్చింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాలలోని అర్హులైన పేదలకు కుటుంబంలో ఒకరికి మాత్రమే జాబ్‌ కార్డులు అందించి, సంవత్సరములో 100 రోజుల పని కల్పించాలి. 15 రోజుల్లో పని కల్పించకపోతే ప్రభుత్వం నిరుద్యోగ భృతి కల్పించాలి. పని ప్రదేశాలలో మహిళలకు అన్ని రకాల వసతులు కల్పించాలి. పని ప్రదేశం ఐదు కిలోమీటర్ల పరిధి దాటితే కూలీలకు ప్రయాణ చార్జీలు చెల్లించాలి. గ్రామ ప్రజల అవసరాలైన చెరువులు, పంట కాలువలు, మురుగు కాలువల నిర్మాణం, అభివృద్ధి పనులు, రహదారుల నిర్మాణం మొదలగు నైపుణ్య రహిత పనులు ఈ పథకం క్రిందకు వస్తాయి. వేతనాల చెల్లింపుకు ఆధార్‌-బ్యాంకు ఖాతాల అనుసంధానం వంటి నిబంధనల కారణంగా సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం, దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలకు వేల కోట్ల రూపాయల బకాయిలు పెరిగిపోయాయి. ఈ పథకం అమలులో నిధుల దుర్వినియోగం, నకిలీ జాబ్‌ కార్డులు, నిధుల దారి మళ్లింపు విధానాల వలన వేల కోట్ల రూపాయల అవినీతి పెరిగిందని కాగ్‌ నివేదిక వెల్లడి చేసింది. అంతేకాకుండా ఈ పథకం ఆయా ప్రాంతాలలోని భూస్వామ్య పెత్తందారీ వర్గాల చేతిలో పనిముట్టుగా తయారయింది. ఆ విధంగా ఉపాధి హామీ పథకం పెత్తందార్ల ఫలహార పథకంగా మారిపోయింది. ఆచరణలో ఈ చట్టాన్ని అరకొరగా అమలు చేసిన ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలకు ఉపాధి హామీ లభించక వలసలు పెరుగుతూనే ఉన్నాయి.

2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని మరింతగా నీరుగార్చేందుకు బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత విధిస్తూ, ఈ పథకం కొన్ని ప్రాంతాలకే అమలు చేయాలని నిర్ణయిస్తూ, పూర్తిగా మానవ శ్రమనే ఉపయోగించటానికి బదులు అనధికారికంగా యంత్రాల వాడకాన్ని పెంచుతూ ఆచరణలో ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రాలు భరిస్తూ ఉండగా ప్రస్తుత నూతన చట్టం ప్రకారం 60 శాతం ఖర్చులను మాత్రమే కేంద్రం భరిస్తుందని, మిగతా 40 శాతం రాష్ట్రాలు భరించాలని పేర్కొన్నారు. ఆ విధంగా రాష్ట్రాలపై భారాన్ని పెంచి ఆచరణలో ఈ పథకాన్ని మరింతగా నీరుగార్చింది. అంతేకాకుండా వ్యవసాయ సీజన్‌లో రెండు నెలల పాటు ఉపాధి హామీ పనులను నిలిపివేయాలని చట్టంలో పేర్కొనటం ద్వారా ఉపాధి కూలీల కడుపులను మాడ్చే నిరంకుశ చర్యకు పూనుకుంది. గతంలో ఉన్న 100 రోజుల పని దినాన్ని 125 రోజులకు పెంచుతున్నట్టు ప్రకటించినప్పటికీ, ఆచరణలో మరిన్ని పని దినాలు కోతకు గురవుతాయి. దీనికి బడ్జెట్‌లో కేటాయింపులకు కోతలు పెట్టడమే సాక్ష్యంగా నిలుస్తోంది.

గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలములోనే ఈ పథకాన్ని నీరుగార్చే చర్యలకు పాల్పడుతూ ఉండగా ఇప్పుడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కొత్త చట్టం పేరుతో పేద ప్రజలకు ఉపాధి దొరక్కుండా ఉరిత్రాడులను తయారు చేస్తున్నది. ఈ కొత్త చట్టం పేరుతో రాష్ట్రాలపై భారాలు పెంచటాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలైన బీహార్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్‌ రాష్ట్రాలు ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. డబుల్‌ ఇంజన్‌ సర్కారులు ఉన్న రాష్ట్రాలే ఈ కొత్త పథకాన్ని వ్యతిరేకిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కూటమి ప్రభుత్వం కనీసం నిరసన తెలియజేయకపోవటం అన్యాయం. ఉపాధి పొందటాన్ని రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుగా డిమాండ్‌ చేస్తూ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలన్న ముఖ్యమైన డిమాండ్‌తో, మోడీ ప్రభుత్వం చేసిన కొత్త చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని రైతు కూలీ సంఘాలు పోరాట బాట చేపట్టాలి. అఖిల భారత స్థాయిలో నరేగా సంఘర్ష మోర్చా కొత్త ఉపాధి చట్టం అమలును నిలిపివేయాలని ఇచ్చిన నిరవధిక ఆందోళనను విజయవంతం చేయడానికి పూనుకోవాలి. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పనులను ప్రారంభించడానికి మూల కారణమైన భూమి సమస్యను పరిష్కరించడానికి సమగ్ర భూ సంస్కరణలను సాధించేందుకు పీడిత ప్రజలు సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలి.