బర్త్ టూరిజంపై ట్రంప్ కొత్త వ్యూహం.. గర్భిణుల ప్రవేశంపై ఆంక్షల దిశగా అడుగులు
బర్త్ టూరిజంపై ట్రంప్ కొత్త వ్యూహం.. గర్భిణుల ప్రవేశంపై ఆంక్షల దిశగా అడుగులు
బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌పై ట్రంప్‌కు ఎదురుదెబ్బ
సుప్రీంకోర్టు తీర్పుతో భారతీయులకు ఊరట
గర్భిణుల ప్రవేశంపై కొత్త ఆంక్షల యోచన
అమెరికాలో పుట్టిన పిల్లలు అమెరికన్లేనంటూ అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలులోకి రాకుండా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర యత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆయన తన మిత్రులు, సహాయకులతో మంతనాలు ఇప్పటికే జరిపారు. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అమలులోకి రాకుండా గర్భిణిలను అమెరికాలో ప్రవేశించకుండా కొత్తగా ఉత్తర్వులు తీసుకురానున్నారు. ప్లాన్-బిగా దీనిని అభివర్ణిస్తున్నారు. బర్త్ టూరిజంను నిరోధించేందుకు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. జన్మతహా అమెరికన్ పౌరసత్వ విలువలను కాపాడేందుకు అనేక మార్గాలున్నాయని ట్రంప్‌కు ఆయన మిత్రులు సూచించినట్టు తెలుస్తోంది.
జన్మతహా పౌరసత్వ హక్కు చెల్లదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ట్రంప్ అధికారం చేపట్టగానే ఈ ఉత్తర్వును జారీ చేశారు. ఎంతో కాలంగా అమలులో ఉన్న ఈ విధానాన్ని మార్చేందుకు ట్రంప్ ప్రయత్నించి భంగపడ్డారు. ఈ తీర్పుతో అమెరికాలో స్థిరపడిన అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసాదారుల పిల్లలు ఇకపై అమెరికన్లుగానే పరిగణించబడతారు. పౌరసత్వ నిబంధనలను మార్చేయాలన్న ట్రంప్ ప్రయత్నం బెడిసి కొట్టింది.
అమెరికాలో భారతీయులే కాకుండా, దక్షిణాసియా దేశాల పౌరులు అధిక సంఖ్యలో స్థిరపడ్డారు. వివిధ వృత్తి, వ్యాపారాల్లో వారు రాణిస్తున్నారు. అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పు వల్ల దక్షిణాసియా, భారతీయ కుటుంబాల వారికి గొప్ప మేలు జరుగుతుందని ఇండియన్-అమెరికన్ ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చింతన్ పటేల్ అన్నారు.
అమెరికాలో సుమారు 52 లక్షల మంది ఇండో-అమెరికన్లలో 12 లక్షల మంది ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని ఎఫ్ఎఫ్ఎస్ఐడీఎస్ అధ్యక్షుడు ఖండేరావు కంద్ అన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఆరు నుంచి 7 లక్షల మంది హెచ్-1బి వీసాదారులు ఉన్నారని ఆయన చెప్పారు. ఈ వీసాల కోసం భారతీయ వలసదారులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఎంతో మందిని ఆశ్రయిస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. వీరిలో అధికులు భారతీయులే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫలితంగా వీరందరికీ ఊరట లభిస్తుంది.
విదేశీ దౌత్య అధికారులకూ, శత్రు దేశాల వారి పిల్లలకు ఇది వర్తించదు. ఇది 1868 నుంచి అమలులో ఉంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా దీనిని మార్చారు. అలా మార్చడం రాజ్యాంగం ప్రకారం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఎంతో కాలంగా పౌరసత్వం కోసం, గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. హెచ్-1 వీసాలపై అమెరికాలో ఉంటున్న విదేశీయుల పిల్లలకు పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న దురుద్దేశ్యంతోనే ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారని ప్రవాస భారతీయులు ఆరోపించారు. అయితే, కోర్టు తీర్పుపై ట్రంప్ మిత్రులు, మాగా అనుకూలురు చేసిన సూచనలను ట్రంప్ పరిశీలిస్తున్నారు. గర్భిణి స్త్రీల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించడం వంటి చర్యలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బర్త్ టూరిజంపై దర్యాప్తు జరపాలని ప్రాసిక్యూటర్లను కోరుతూ అమెరికా న్యాయశాఖ ఇటీవల మెమోను జారీ చేసింది.
