చేనేత సంఘం ఎన్నికల్లో వివాదం..
- పోలీసులకు ఫిర్యాదు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల చేనేత సహకార సంఘం ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా గురువారం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామ దేవాలయ ఆవరణలో ఓటర్లను ఒక నిర్దిష్ట అభ్యర్థికి మద్దతుగా దేవునిపై ప్రమాణం చేయించేందుకు కొందరు ప్రయత్నించగా, దాన్ని వ్యతిరేకించిన గుర్రం నరసింహ అనే సభ్యునిపై భౌతిక దాడి జరిగింది. బాధిత సభ్యుని కథనం ప్రకారం… ఎన్నికల స్వేచ్ఛకు విరుద్ధంగా దేవుని పేరిట ప్రమాణాలు చేయించడాన్ని తాను తప్పుబట్టడంతో గంజి లింగేష్ అనే వ్యక్తి తనపై దాడి చేసి గాయపరిచాడు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న తడక మోహన్, తడక ఆంజనేయులు, తడక శ్రీనివాస్, గుర్రం శ్రీరాములు, తడక కోటేశ్వర్, కోడెం రాములు తదితరులు దాడికి సహకరిస్తూ తమ మాట వినకపోతే అంతం చూస్తామంటూ ప్రాణహాని కలిగించేలా బెదిరించారని నరసింహ ఆరోపించారు. ఈ ఘటనపై చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దర్యాప్తు చేయాలని, రానున్న జూలై 10న జరిగే చేనేత సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.
