దారుణంగా ప్రభుత్వ హాస్టల్ పరిస్థితి: బీఆర్ఎస్వీ నాయకులు

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: భూపాలపల్లి మండలం గొల్ల బుద్ధారం ప్రభుత్వ ఎస్టీ బాలుర హాస్టల్‌లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు ఆరోపించారు. గురువారం హాస్టల్‌తో పాటు ప్రభుత్వ పాఠశాలను వారు సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు కొల్లోజు దిలీప్ కుమార్ మాట్లాడుతూ, హాస్టల్‌లో ఆర్వో ప్లాంట్ నెలలుగా పనిచేయకపోవడంతో విద్యార్థులు నల్లా నీటినే తాగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. గదులకు తలుపులు, కిటికీలకు జాలీలు లేకపోవడంతో దోమలు, పురుగుల మధ్య విద్యార్థులు ఉండాల్సి వస్తోందని తెలిపారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందడం లేదని, హాస్టల్ నిర్వహణ అధ్వానంగా మారిందని విమర్శించారు.

ప్రభుత్వ పాఠశాలలోనూ సమస్యలు కొనసాగుతున్నాయని, విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందలేదని పేర్కొన్నారు. తరగతి గదుల కొరతతో చిన్న వయసు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హాస్టల్, పాఠశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్వీ హెచ్చరించింది.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు బానోత్ మహేశ్వర్, కత్తి వినయ్ గౌడ్, భూక్య హరీష్, ఆంగోతు తిరుపతి, రాపాల రాకేష్, దేవేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.