సకల జనులకు సేవలే నా లక్ష్యం
- నూతన బిషప్ డాక్టర్ దుగ్గింపూడి విజయ్ పాల్
కాజీపేట, ఆంధ్రప్రభ : సమాజంలోని క్రైస్తవ విశ్వాసులతో పాటు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించడమే తన లక్ష్యమని వరంగల్ మేత్రాసన నూతన పీఠాధిపతి బిషప్ డాక్టర్ దుగ్గింపూడి విజయ్ పాల్ అన్నారు.
కాజీపేట పట్టణంలోని ఫాతిమానగర్ పాస్టరల్ హాల్‌లో క్రైస్తవ మీడియా కమిటీ ఆధ్వర్యంలో, ఫాదర్ ఎం. విజయ్ పాల్ రెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సమాజంలోని ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, సామాజిక సేవలతో పాటు ఆధ్యాత్మిక, ఆర్థిక పరమైన సేవలను అందించేందుకు అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించి మంచి సమాజ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. అందరి సహకారంతో వరంగల్ మేత్రాసనాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శంగా నిలిపేందుకు శ్రమిస్తానన్నారు.
ఈ నెల 3న కాజీపేట ఫాతిమా మాత దేవాలయంలో అగ్రపీఠాధిపతుల సమక్షంలో వరంగల్ మేత్రాసన నాలుగో పీఠాధిపతిగా తన పట్టాభిషేక మహోత్సవం జరగనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి హైదరాబాద్ మహా శ్రేష్ఠ కార్డినల్ పూలా ఆంథోని, విశాఖపట్నం అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుమల బాల, శ్రీకాకుళం అగ్రపీఠాధిపతి డాక్టర్ రాయరాల విజయ్ కుమార్, ఢిల్లీ అగ్రపీఠాధిపతి అనిల్ జోసెఫ్ థామస్, శంషాబాద్ అగ్రపీఠాధిపతి ఆంథోని ప్రిన్స్, ఏలూరు అగ్రపీఠాధిపతి డాక్టర్ జయరావు పోలిమేరతో పాటు పలువురు బిషప్‌లు హాజరుకానున్నట్లు తెలిపారు.
పరిశుద్ధ లియో పోప్ ప్రతినిధి (పాపల్ నున్షియో) ఢిల్లీ నుంచి విచ్చేసి పట్టాభిషేకం అనంతరం పీఠాధిపతి పట్టాను అందజేస్తారని చెప్పారు. అలాగే వరంగల్ మేత్రాసన పరిధిలో నూతనంగా నిర్మించిన బిషప్ హౌస్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల పరిధిలోని 12 జిల్లాల నుంచి క్రైస్తవ విశ్వాసులు, ఫాదర్లు, బ్రదర్లు, మతకన్యలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పట్టాభిషేక మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఫాదర్ తాటికొండ జోసెఫ్, ఫాదర్ కాసు మర్రెడ్డి, ఫాదర్ వై. కిరణ్, ఫాదర్ బాలరాజ్, బ్రదర్ జార్జ్, టామీ, మత్యాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
