40,000 acres | భారత వ్యవసాయం, రైతుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన సంస్థకు గుర్తింపు

20 వేల మంది రైతులతో భాగస్వామ్యం..
2030 నాటికి పాప్‌కార్న్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధే లక్ష్యం

40,000 acres | హైద‌రాబాద్‌, ఆంధ్రప్రభ : భారతదేశంలో అతిపెద్ద, ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద మొక్కజొన్న పాప్‌కార్న్ ఉత్పత్తి సంస్థగా గుర్తింపు పొందిన గౌర్మెట్ పాప్‌కార్నికాకు భారత ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ ప్రశంసలు తెలిపారు. భారతీయ వ్యవసాయం, రైతుల జీవనోపాధి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల సాధనలో సంస్థ అందిస్తున్న విశేష సేవలను అభినందిస్తూ ఆయన వ్యక్తిగత ప్రశంసా పత్రాన్ని పంపారు.

జూన్ 23, 2026 తేదీతో గౌర్మెట్ పాప్‌కార్నిక ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌బీపీ పట్టాభి రామారావుకు రాసిన లేఖలో, సంస్థ లక్ష్యసాధన, పట్టుదల, వ్యవస్థాపక స్ఫూర్తిని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. మొక్కజొన్న రైతులకు విలువను పెంచుతూ, వారి జీవనోపాధికి తోడ్పడటంతో పాటు పాప్‌కార్న్‌ను దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చిరుతిళ్లలో ఒకటిగా తీర్చిదిద్దడంలో సంస్థ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్‌బీపీ పట్టాభి రామారావు మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి నుంచి లభించిన ఈ గుర్తింపు తన ఒక్కరికే కాకుండా తమపై విశ్వాసం ఉంచిన ప్రతి రైతుకు, సంస్థ సిబ్బందికి దక్కిన గౌరవమని అన్నారు. భారతీయ వ్యవసాయ రంగానికి మరింత సేవ చేయాలనే సంకల్పానికి ఇది మరింత ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.

అమెరికాలోని నెబ్రాస్కాలో ఉన్న ప్రిఫర్డ్ పాప్‌కార్న్ సంస్థ నుంచి వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించి ప్రారంభమైన ఈ ప్రయాణం ప్రస్తుతం దేశంలోని తొమ్మిది రాష్ట్రాలకు విస్తరించింది. ప్రస్తుతం గౌర్మెట్ పాప్‌కార్నిక సుమారు 20 వేల మంది రైతులతో కలిసి 40 వేల ఎకరాల్లో మొక్కజొన్న పాప్‌కార్న్ సాగు నిర్వహిస్తోంది.

2030 నాటికి పాప్‌కార్న్ ఉత్పత్తిలో భారతదేశాన్ని స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లడమే కాకుండా, ప్రపంచ స్థాయి నాణ్యమైన పాప్‌కార్న్ ఎగుమతిదారుగా దేశాన్ని నిలబెట్టాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోంది.

2014లో స్థాపించబడిన గౌర్మెట్ పాప్‌కార్నిక హైబ్రిడ్ విత్తనాల నుంచి రైతుల భాగస్వామ్యం, కెర్నెల్ ప్రాసెసింగ్, నిల్వ, సినిమా పరిశ్రమకు సరఫరా, రిటైల్, ఈ-కామర్స్ ఉత్పత్తుల వరకు పాప్‌కార్న్ విలువ గొలుసును అభివృద్ధి చేస్తోంది. ఉత్పత్తి నాణ్యత, రైతుల సంక్షేమం, స్థిరమైన ప్యాకేజింగ్, బాధ్యతాయుతమైన సేకరణకు సంస్థ ప్రాధాన్యం ఇస్తోంది.