ప్రతిభకు ప్రోత్సాహం.. మెరిట్ విద్యార్థులకు నగదు బహుమతులు
కోదాడ, ఆంధ్రప్రభ: కోదాడ పట్టణంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మాజీ రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ముత్తవరపు రామారావు నగదు ప్రోత్సాహకాలను అందించారు. 2026 ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో జిల్లా టాపర్లుగా నిలిచి ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులు హరి, విన్ని, హరీష్‌లకు రూ.5,000 చొప్పున ప్రోత్సాహక నగదును అందజేశారు. ఈ సందర్భంగా కోదాడ మండల విద్యాధికారి ఎం.డి. సలీం షరీఫ్ రామారావును అభినందించారు.
రిటైర్డ్ హెచ్‌ఎం ముత్తవరపు రామారావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సమిష్టి కృషితో పాఠశాల కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తోందని, భవిష్యత్తులోనూ ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రోత్సహిస్తానని తెలిపారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
