హరీష్ రావు అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్

  • ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు

కరీంనగర్, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి హరీష్ రావు అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు విమర్శించారు. గురువారం కరీంనగర్ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హరీష్ రావు ప్రతిరోజూ ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయని, దేశంలోనే అత్యధికంగా వరి, మొక్కజొన్న సాగు నమోదైందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి–చేవెళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిందని ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రెండేళ్లకే దెబ్బతినడం బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.

పారే నీటిని మళ్లీ అదే నదిలోకి ఎత్తిపోసే విధంగా ప్రాజెక్టును రూపొందించడం ప్రపంచంలో ఎక్కడా కనిపించదని, గోదావరిపై మూడు బ్యారేజీలు నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా ఉపయోగించుకున్న హరీష్ రావు, అది ఎందుకు దెబ్బతిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పాలన నుంచి బయటపడి ప్రశాంతంగా జీవిస్తున్నారని పేర్కొన్న ఆయన, హరీష్ రావు నిద్రలేచినప్పటి నుంచి అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక బురదజల్లే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

రైతు సంక్షేమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని చింతకుంట విజయ రమణారావు తెలిపారు. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి 54.92 లక్షల మంది రైతుల ఖాతాల్లో మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులను ఒకేరోజు జమ చేశామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు కింద రూ.70 వేల కోట్లు ఖర్చు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలోనే రైతు భరోసా కింద రూ.30 వేల కోట్లు విడుదల చేసిందన్నారు.

ఎన్నికలకు ముందు పెండింగ్‌లో ఉన్న రూ.7 వేల కోట్ల బకాయిలను చెల్లించామని, రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ కోసం రూ.21 వేల కోట్లు విడుదల చేశామని తెలిపారు. సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించామని, కేంద్రం కొనుగోలు చేయని మక్కలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇప్పటి వరకు నాలుగు లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.